Andhra Pradesh: ఈ ఏడాది జూన్ నుంచే రైతులకు సాగునీటిని అందించాలి!: సీఎం చంద్రబాబు ఆదేశాలు

  • నీరు - ప్రగతి, వ్యవసాయంపై టెలికాన్ఫరెన్స్
  • ఖరీఫ్ సేద్యం ప్రణాళికలు పటిష్టంగా అమలు చేయాలి
  • ఎరువుల కొరత లేకుండా చూడాలి
  • అంతర్జాతీయంగా మేలైన పద్ధతులు అధ్యయనం చేయాలి

ఈ ఏడాది జూన్ నుంచే రైతులకు సాగునీటిని అందించాలని, సకాలంలో సేద్యం పనులు పూర్తి కావాలని సీఎం చంద్రబాబునాయుడు ఆదేశించారు. అమరావతిలో నీరు - ప్రగతి, వ్యవసాయంపై టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ, రెయిన్ గన్స్ ముందస్తుగా సంసిద్ధం చేసుకోవాలని, ఖరీఫ్ సేద్యం ప్రణాళికలు పటిష్టంగా అమలుచేయాలని, విత్తనాలు, ఎరువుల కొరత లేకుండా చూడాలని, సూక్ష్మ పోషకాలు రైతులకు ఉచితంగా అందజేయాలని, సూక్ష్మ పోషకాల వినియోగం వల్ల వివిధ పంటల దిగుబడులు పెరిగాయని ఆదేశాలు జారీ చేశారు.

అంతర్జాతీయంగా మేలైన పద్ధతులు అధ్యయనం చేయాలని, వాటిని రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేయాలని సూచించారు. ప్రతి ఏటా పంట దిగుబడులు గణనీయంగా పెరగాలని, పోషకాహార లోపం అనేది మన రాష్ట్రంలో ఉత్పన్నం కారాదని, ప్రతి శాఖా పనితీరు, సామర్థ్యం మెరుగు పరుచుకోవాలని, ప్రతి శాఖలో సాధించిన ఫలితాలే ప్రామాణికంగా ఉంటాయని తెలిపారు. నెల వారీ, క్వార్టర్లీ ప్రగతిని విశ్లేషించాలని, లక్ష్యాలను చేరుకోవాలని, వినూత్న ప్రణాళికలు రూపొందించి వాటిని సమర్ధంగా అమలు చేయాలని సూచించారు.
 
నూరు శాతం మెకనైజేషన్, నూరు శాతం ఉబరైజేషన్ కు వెళ్లాలి

నూరు శాతం మెకనైజేషన్, నూరు శాతం ఉబరైజేషన్ కు వెళ్లాలని, ఉబరైజేషన్ ద్వారా డ్వాక్రా మహిళలకు ఉపాధి లభిస్తుందని, రైతులకు సేంద్రియ ఎరువుల కొరత తీరుతుందని, వ్యవసాయ దిగుబడులు పెరుగుతాయని చంద్రబాబు అన్నారు. ఈ ఏడాది నరేగా లక్ష్యం రూ.8వేల కోట్ల పైబడి చేరుకోవాలని, లేబర్ కాంపోనెంట్ లో వందరోజుల పనిలో ప్రకాశం జిల్లా ముందు ఉండటం హర్షణీయమని అన్నారు.

ఎక్కడ లోపాలు జరుగుతున్నాయనే దానిపై ప్రతివారం విశ్లేషించాలని, వాటిని అధిగమించాలని, భవిష్యత్తుకు సన్నద్ధం కావాలని సూచించారు. గత ఏడాది ఎంత సాధించాం అనేది బెంచ్ మార్క్ గా తీసుకోవాలని, రాబోయే ఏడాది లక్ష్యాలను నిర్ణయించుకుని వాటిని సాధించుకోవాలని, నెలవారీ, క్వార్టర్లీ ప్రగతిని విశ్లేషించాలని అన్నారు. విజయవాడ-గన్నవరం విమానాశ్రయం రహదారిని చక్కగా తీర్చిదిద్దారని ప్రశంసించారు. ఇదే తరహాలో గుంటూరు వరకు సుందరీకరణ పనులు చేపట్టాలని, దీనిని నమూనాగా తీసుకుని అన్ని జిల్లాల్లో రహదారులను తీర్చిదిద్దాలని అన్నారు. తాగునీటి ఎద్దడి లేకుండా చూడాలని, ఎక్కడికక్కడ చలివేంద్రాలు నిర్వహించాలని, వడదెబ్బ నివారణకు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.

ఒక్కరోజు బంద్ వల్ల రాష్ట్రానికి ఎంత నష్టమో ఆలోచించాలి


ఒక్కరోజు బంద్ వల్ల రాష్ట్రానికి ఎంత నష్టమో ఆలోచించాలని, మనల్ని మనం శిక్షించుకోరాదని చంద్రబాబు అన్నారు. మనకు అన్యాయం చేసిన వారిని శిక్షించాలని, మన నిరసనలు కూడా రాష్ట్రానికి ప్రయోజనకరంగా ఉండాలని సూచించారు. అందుకే అరగంట సేపు నిరసనలో పాల్గొనండి, అధికంగా మరో గంటసేపు పని చేయమని కోరానని, మన సమర్ధతతో జాతీయంగా అన్ని అంశాలలో ముందున్నామని అన్నారు.

  • Loading...

More Telugu News