fixed term: లోక్ సభ, అసెంబ్లీలకు ఫిక్స్ డ్ టర్మ్... మధ్యంతర ఎన్నికల బెడద లేదు: నీతి ఆయోగ్ సూచన
- ఇందుకోసం ప్రత్యేకంగా చట్టం చేయాల్సిన అవసరం ఉంది
- మధ్యంతర ఎన్నికలతో మెజారిటీ మారితే పరిస్థితి ఏంటి?
- ప్రభుత్వానికి నీతి ఆయోగ్ నివేదిక
లోక్ సభకు, రాష్ట్రాల అసెంబ్లీలకు ఫిక్స్ డ్ టర్మ్ (స్థిర కాలం) ఉండాలని నీతి ఆయోగ్ ప్రభుత్వానికి సూచించింది. దీనివల్ల ఎన్నికల విధానం కుదురుకుంటుందని, దేశవ్యాప్తంగా ఏక కాలంలో ఎన్నికల నిర్వహణకు (జమిలి ఎన్నికలు) వీలు పడుతుందని పేర్కొంది. మధ్యంతర ఎన్నికలను నివారించేందుకు లోక్ సభ, రాష్ట్రాల అసెంబ్లీలకు ఐదేళ్ల ఫిక్స్ డ్ టర్మ్ (స్థిర కాలం) ఉండాలని తన నివేదికలో పేర్కొంది. బ్రిటన్ రూపొందించిన ఓ చట్టాన్ని నీతి ఆయోగ్ ప్రస్తావించింది. సాధారణ ఎన్నికల నిర్వహణకు ముందు పార్లమెంట్ నిర్ణీత కాలం పాటు పనిచేసే విధంగా బ్రిటన్ ‘ఫిక్స్ డ్ టర్మ్ పార్లమెంట్ యాక్ట్ 2011’ను తీసుకొచ్చింది.
ప్రస్తుతం మన దేశంలో ఉన్న వ్యవస్థ ఐదేళ్ల పదవీ కాలానికి ఎటువంటి హామీ ఇవ్వడం లేదని గుర్తు చేసింది. చట్టాన్ని తీసుకురాకుండా ఒకేసారి లోక్ సభ, రాష్ట్రాల అసెంబ్లీలకు ఎన్నికలు నిర్వహించడం వల్ల ఉపయోగం లేదని, మధ్యంతరంగా పలు రాష్ట్రాల్లో ఎన్నికలు నిర్వహించాల్సిన పరిస్థితి రాకూడదనేదేమీ లేదని పేర్కొంది. ఒకేసారి ఎన్నికలు నిర్వహించిన తర్వాత ఉప ఎన్నికలు జరిగి అధికార పార్టీ లేదా సంకీర్ణం మెజారిటీ కోల్పోతే పరిస్థితి ఏంటన్న సందేహం వ్యక్తం చేసింది.