air china: ఫౌంటెన్ పెన్నుని గన్నుగా చూపి.. విమానంలోని వారిని బెంబేలెత్తించిన ప్రయాణికుడు
- చాంగ్ షా నుంచి బీజింగ్ కు బయల్దేరిన ఎయిర్ చైనా విమానం
- ఫ్లైట్ అటెండెంట్ ను బందీగా చేసుకునే ప్రయత్నం
- జెంగ్డౌ విమానాశ్రయంలో ఎమర్జన్సీ ల్యాండింగ్
ఫౌంటెన్ పెన్నుని గన్నుగా చూపించి విమానంలోని సిబ్బందిని బందీగా తీసుకునే ప్రయత్నం చేసి, విమానంలోని వారిని ఒక ప్రయాణికుడు బెంబేలెత్తించిన ఘటన చైనాలో చోటుచేసుకుంది. ఆ వివరాల్లోకి వెళ్తే... ఎయిర్ చైనాకు చెందిన విమానం హునాన్ ప్రావిన్స్ లోని చాంగ్ షా విమానాశ్రయం నుంచి బీజింగ్ కు బయల్దేరింది. ఈ విమానంలో ఒక ప్రయాణికుడు తన వద్దనున్న ఫౌంటెన్ పెన్నుని గన్ అని చెప్పి, ఫ్లైట్ అటెండెంట్ ను బందీగా చేసుకునే ప్రయత్నం చేశాడు. దీంతో విమానంలోని ప్రయాణికులు బెంబేలెత్తిపోయారు.
వెంటనే పైలట్లు సమాచారాన్ని ఉన్నతాధికారులకు వివరించారు. వారి సూచనల మేరకు ఫ్లైట్ ను అత్యవసరంగా జెంగ్జౌ విమానాశ్రయానికి మళ్లించి ల్యాండ్ చేశారు. వెంటనే అత్యవసర భద్రతా బలగాలు విమానాన్ని చుట్టుముట్టి, ప్రయాణికులను, విమాన సిబ్బందిని సురక్షితంగా దించేశారు. అనంతరం నిందితుడ్ని అదుపులోకి తీసుకుని, ప్రయాణికులను మరో విమానంలో పంపారు. ఈ ఘటన పూర్తి వివరాలు వెల్లడించేందుకు చైనా పౌరవిమానయాన శాఖ నిరాకరించింది.