Chandrababu: కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల విషయమై... సీఎం చంద్రబాబుకు లేఖ రాసిన రఘువీరారెడ్డి
- జి.ఓ.నెం.27 ను రద్దు చేయాలి
- కోర్టు తీర్పును గౌరవిస్తారని ఆశిస్తున్నా
- వైద్య ఆరోగ్య శాఖలో శాశ్వత ప్రాతిపదికన నియామకాలు చేపట్టాలి
ఏపీ సీఎం చంద్రబాబునాయుడుకి ఏపీసీసీ చీఫ్ రఘువీరారెడ్డి ఓ లేఖ రాశారు. ఆంధ్ర ప్రదేశ్ ప్రజారోగ్య వైద్య ఉద్యోగుల సంఘం కోరుతున్న జి.ఓ.నెం.27 రద్దు చేయాలని, వారి డిమాండ్లు నెరవేర్చాలని ఈ లేఖలో కోరారు.
‘కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల పాలిట గొడ్డలి పెట్టుగా ఉన్న 2018 మార్చి 16వ తేదీన మీ ప్రభుత్వం తెచ్చిన జి.ఓ.నెం.27 ను సవరించి, 'కన్సాలిడేటెడ్ పే' అనే విధానం రద్దు చేయాలని 21 వేల మంది ప్రజారోగ్య వైద్య ఉద్యోగులు ఆందోళనకు దిగారు. వారి డిమాండు ఎంతో సమంజసమైనది. ఒకే పనికి ఒకే వేతనం అమలు చేయాలన్న సుప్రీం కోర్టు తీర్పునకు అనుగుణమైనది. కోర్టు తీర్పునైనా గౌరవిస్తారని ఆశిస్తున్నాను. ఫీల్డ్ వర్క్ చేసే పారా మెడికల్ ఉద్యోగులకు బయో మెట్రిక్ పద్ధతిని అమలు చేయడం ఎంత హాస్యాస్పదమో, అది వారి దైనందిన పనిని ఎలా ఆటంక పరుస్తుందో కనీస జ్ఞానం ఉన్న ఎవరికైనా ఇట్టే అర్థమవుతుంది. మరి మీకు, మీ ప్రభుత్వానికి ఎందుకు తెలియటం లేదో! వారు కోరుతున్న విధంగా ఆ విధానాన్ని వెంటనే నిలిపి వేయాలి’
‘ప్రజారోగ్య పనులు కుంటుపడే విధంగా వారిని ఇతర పనులకు, తమరి ప్రచార కార్యక్రమాలకు వినియోగించటం దారుణం. తక్షణమే నిలిపి వేయాలి. హైకోర్టు తీర్పును అనుసరించి వైద్య ఆరోగ్య శాఖలో కాంట్రాక్టు విధానాన్ని తొలగించి శాశ్వత ప్రాతిపదికన ఉద్యోగ నియామకాలు చేపట్టాలి. ఈ మధ్య జరిగిన 84వ ప్లీనరీ సమావేశంలో కాంగ్రెస్ పార్టీ కాంట్రాక్టు ఉద్యోగుల, కార్మికుల దోపిడీని రద్దు చేస్తామని తీర్మానించిన విషయాన్ని ఈ సందర్భంగా మీ దృష్టికి తీసుకు వస్తున్నాను. ప్రజా శ్రేయస్సును దృష్టిలో పెట్టుకొని ప్రాధమిక వైద్య కేంద్రాలకు, ఉప కేంద్రాలకు సరిపడే స్థాయిలో మందుల సరఫరా చేయాలని వారు చేస్తున్న డిమాండు అభినందనీయం. వెంటనే దృష్టి సారించాలి. ఎంతో సమంజసమైన వారి డిమాండ్లను పరిష్కరించి ప్రజారోగ్యం పట్ల, ఉద్యోగుల సంక్షేమం పట్ల మీ చిత్తశుద్ధిని నిరూపించుకుంటారని ఆశిస్తాను’ అని కోరారు.