Commonwealth Games: కామన్వెల్త్‌లో చరిత్ర సృష్టించిన మేరీ కోమ్
- బాక్సింగ్‌లో భారత్‌కు తొలి స్వర్ణం అందించిన మేరీకోమ్
- పోటీల్లో పాల్గొన్న తొలిసారే పసిడితో మెరిసిన ఒలింపియన్
- పతకాల పట్టికలో మూడో స్థానంలో భారత్
ఆస్ట్రేలియాలోని గోల్డ్‌కోస్ట్‌లో జరుగుతున్న ప్రతిష్ఠాత్మక కామన్వెల్త్ క్రీడల్లో భారత్ బాక్సర్ మేరీకోమ్ సరికొత్త చరిత్ర సృష్టించింది. ఐదుసార్లు ప్రపంచ చాంపియన్ అయిన మేరీ కోమ్ ఒలింపిక్ కాంస్య పతక విజేత కూడా. ఇప్పుడు కామన్వెల్త్‌లో భారత్‌కు బాక్సింగ్‌లో తొలి స్వర్ణ పతకాన్ని అందించిన మహిళగా రికార్డులకెక్కింది.
శుక్రవారం అర్ధరాత్రి దాటాక జరిగిన ఫైనల్లో ఉత్తర ఐర్లండ్‌కు చెందిన క్రిస్టినా ఓహరను పదునైన పంచ్‌లతో చిత్తుచేసి భారత్‌కు స్వర్ణం అందించింది. 45-48 కేజీల విభాగంలో జరిగిన ఈ బౌట్‌లో 30-27, 30-27, 29-28, 30-27, 20-27తో తిరుగులేని విజయం సాధించి త్రివర్ణ పతాకాన్ని రెపరెపలాడించింది.
మణిపూర్‌కు చెందిన 35 ఏళ్ల మేరీ కోమ్ కామన్వెల్త్ గేమ్స్‌లో పాల్గొనడం ఇదే తొలిసారి. పాల్గొన్న తొలిసారే స్వర్ణం కొల్లగొట్టడం విశేషం. ఈ పోటీల్లో భారత్ శనివారం ఉదయానికి 18 స్వర్ణాలు, 11 రజతాలు, 14 కాంస్య పతకాలు సాధించి మొత్తం 43 పతకాలతో మూడో స్థానంలో ఉంది.