Unnao: దెబ్బకు దిగొచ్చిన యోగి ప్రభుత్వం.. బీజేపీ ఎమ్మెల్యేపై రేప్ కేసు.. పోలీసులు, వైద్యులపై వేటు!
- బీజేపీ ఎమ్మెల్యేపై రేప్ కేసుకు ప్రభుత్వం రెడీ
- సీబీఐతో దర్యాప్తునకు ఆదేశాలు
- డీఎస్పీ స్థాయి అధికారిపై వేటు
- జైలు వైద్యులపై క్రమశిక్షణ చర్య
దేశవ్యాప్తంగా వెల్లువెత్తుతున్న నిరసనలతో ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం దిగొచ్చింది. ఉన్నావోకు చెందిన బాలికపై అత్యాచారానికి ఒడిగట్టినట్టు ఆరోపణలు ఎదుర్కొంటున్న బీజేపీ ఎమ్మెల్యే కుల్దీప్ సింగ్ సెంగార్‌పై ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని యూపీ ప్రభుత్వం నిర్ణయించింది.
ఈ కేసును సీబీఐతో దర్యాప్తు జరిపించనుంది. బాలికపై అత్యాచారానికి, ఆమె తండ్రి మరణానికి, తనకు ఎటువంటి సంబంధం లేదని పోలీసులతో చెప్పించేందుకు ఎమ్మెల్యే కుల్దీప్ ప్రయత్నించారు. లక్నో పోలీస్ చీఫ్ అధికారిక నివాసం ఎదుట కుల్దీప్ కనిపించడం ఆ వార్తలకు ఊతమిచ్చింది. ఈ నేపథ్యంలోనే ప్రభుత్వం సీబీఐతో దర్యాప్తు జరిపించాలని నిర్ణయం తీసుకుని సొంత పార్టీ ఎమ్మెల్యేకు షాకిచ్చింది.
ఉన్నవో జిల్లా ఆసుపత్రికి చెందిన ఇద్దరు సీనియర్ వైద్యులపైనా ప్రభుత్వం వేటు వేసింది. రేప్ బాధితురాలి తండ్రికి వైద్యం చేయడంలో నిర్లక్ష్యంగా వ్యవహరించిన ముగ్గురు జైలు వైద్యులపై క్షమశిక్షణ చర్యలకు ఆదేశించింది. బాధిత కుటుంబం పదేపదే చేస్తున్న ఫిర్యాదులకు స్పందించని డీఎస్పీ స్థాయి అధికారిని సస్పెండ్ చేసింది.