Uttar Pradesh: యూపీ డీజీపీని కలిసిన 'ఉన్నావో రేప్' నిందిత ఎమ్మెల్యే భార్య
- అత్యాచార బాధితురాలికి, నా భర్తకి నార్కో పరీక్ష చేయండి
- మీడియా మమ్మల్ని వేధిస్తోంది
- మీడియా కథనాలు ఆపకపోతే విషం తాగుతాం
ఉత్తరప్రదేశ్ లోని ఉన్నావోలో యువతిపై అత్యాచారానికి పాల్పడి, బాధిత కుటుంబాన్ని బెదిరించి, బాధితురాలి తండ్రిని పోలీస్ కస్టడీలో పొట్టనబెట్టుకున్నాడని ఆరోపణలు ఎదుర్కొంటున్న బీజేపీ ఎమ్మెల్యే కుల్దీప్ సెంగార్ భార్య సంగీత సెంగార్ ఆ రాష్ట్ర డీజీపీ ఓపీ సింగ్ ను కలిసి, వినతిపత్రం సమర్పించారు. ఉన్నావోకి చెందిన అత్యాచార బాధితురాలితో పాటు తన భర్తకు నార్కో పరీక్షలు నిర్వహించాలని అందులో కోరారు. అనంతరం ఆమె మీడియాతో మాట్లాడుతూ, మీడియా తమను మానసికంగా వేధిస్తోందని ఆరోపించారు.
తన భర్త నిర్దోషి అని స్పష్టం చేసిన ఆమె, తన భర్తపై మీడియా కథనాలు రేపిస్టు ముద్ర వేశాయని మండిపడ్డారు. ఎలాంటి ఆధారాలు లేకుండానే తమ కుమార్తెలను మీడియా భయాందోళనలకు గురిచేస్తోందని ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. తన భర్త కానీ, ఆయన తమ్ముడు కానీ బాధితులపై దాడి చేయలేదని ఆమె స్పష్టం చేశారు. పోలీసులే ఆయనపై దాడి చేశారని ఆమె తెలిపారు. తన భర్తపై వస్తున్న ఆరోపణలన్నీ అసత్యాలని, కట్టుకథలని, నిరాధారమైనవని ఆమె పేర్కొన్నారు. మీడియాలో తన భర్తకు వ్యతిరేకంగా వస్తున్న కథనాలను నిలిపివేయకపోతే తన కుమార్తెలతో కలిపి విషం తాగుతామని ఆమె హెచ్చరించారు.