Indigo: ఏంటీ ఇండిగో?... దోమలున్నాయని ఫిర్యాదు చేసినందుకు విమానం నుంచి గెంటివేత!
- మరోసారి వార్తల్లోకి ఎక్కిన ఇండిగో
- ఫిర్యాదు చేసినా పట్టించుకోకుండా ప్రయాణికుడి గెంటివేత
- లక్నో - బెంగళూరు సర్వీసులో ఘటన
- హైజాక్ చేస్తానని బెదిరించాడని ఆరోపించిన ఇండిగో
దేశీయ ప్రైవేటు విమానయాన సంస్థ ఇండిగో మరోసారి వార్తల్లోకి ఎక్కి విమర్శలు కొనితెచ్చుకుంది. విమానంలో దోమలు ఉన్నాయని ఫిర్యాదు చేసిన ప్రయాణికుడిని సిబ్బంది గెంటివేశారు. లక్నో నుంచి బెంగళూరు వెళుతున్న 6ఈ 541 సర్వీసులో ఈ ఘటన జరిగింది. సౌరబ్ రాయ్ అనే వ్యక్తి విమానం ఎక్కిన తరువాత, విమానంలో దోమలు ఉన్నాయని ఫిర్యాదు చేశాడు. సిబ్బంది పట్టించుకోక పోవడంతో, ఇతర ప్రయాణికులకు విషయం చెప్పి నిలదీద్దామని అన్నాడు.
దీంతో ఆగ్రహించిన విమానం సిబ్బంది బయటి నుంచి సెక్యూరిటీని పిలిచి అతడిని బలవంతంగా విమానం నుంచి దించేయించారు. జరిగిన ఘటనపై విమర్శలు వెల్లువెత్తగా, వివరణ ఇచ్చిన ఇండిగో, సదరు ప్రయాణికుడు సిబ్బందిని ఇష్టమొచ్చినట్టు దూషించాడని, విమానాన్ని హైజాగ్ చేస్తానని హెచ్చరించడంతో పాటు, కుర్చీలను విరిచేయాలని, విమానాన్ని ధ్వంసం చేయాలని ఇతర ప్రయాణికులను ఉసిగొల్పుతున్నందునే దించి వేశామని చెప్పింది. ఏది ఏమైనా, సుమిత్ కు జరిగిన అసౌకర్యానికి చింతిస్తున్నామని, ఎన్జీటీ నిబంధనల ప్రకారం, విమానంలో ప్రయాణికులు లేని సమయంలోనే దోమల మందును ప్రయోగిస్తామని చెప్పింది. కాగా, ఇటీవలి కాలంలో ఇండిగోపై ఫిర్యాదులు వెల్లువెత్తుతున్న సంగతి తెలిసిందే.