rbi: ఆర్ బీఐ ఆదేశాలపై సుప్రీంకోర్టుకు వెళ్లే యోచనలో క్రిప్టోకరెన్సీ ఎక్సేంజ్ లు

  • బిట్ కాయిన్ తరహా క్రిప్టోల ట్రేడింగ్ కు సేవలు అందించొద్దు
  • బ్యాంకులు, ఇతర సంస్థలను ఆదేశించిన ఆర్ బీఐ
  • వ్యాపారాలకు విఘాతం కలిగిస్తుందని ఎక్సేంజీల ఆందోళన

బిట్ కాయిన్, క్రిప్టోకరెన్సీల్లో లావాదేవీలకు గాను చెల్లింపుల సేవలు అందించొద్దంటూ బ్యాంకులు, తన పరిధిలోని ఇతర సంస్థలను ఆర్ బీఐ ఆదేశించిన విషయం విదితమే. దీనిపై క్రిప్టోకరెన్సీ ఎక్సేంజ్ లు సుప్రీంకోర్టుకు వెళ్లే అంశాన్ని పరిశీలిస్తున్నాయి. ఆర్ బీఐ ఆదేశాలను సుప్రీంకోర్టులో సవాలు చేయాలని యోచిస్తున్నట్టు యూనోకాయిన్, జెబ్ పే, కాయిన్ సెక్యూర్ ఇప్పటికే తెలిపాయి. పరిశ్రమలోని భాగస్వాములు, బ్లాక్ చెయిన్, క్రిప్టోకరెన్సీ అసోసియేషన్, ఇంటర్నెట్, మొబైల్ అసోసియేషన్ తో చర్చిస్తున్నట్టు కాయిన్ సెక్యూర్ తెలిపింది.

ఆర్ బీఐ ఆదేశాలపై సుప్రీంకోర్టు స్టే మంజూరు చేసే అవకాశాలున్నాయా అన్నది పరిశీలిస్తున్నట్టు కాయిన్ సెక్యూర్ చీఫ్ అపరేటింగ్ అధికారి జిన్సీ శామ్యూల్ పేర్కొన్నారు. ఆర్ బీఐ ఆదేశాలు తమ వ్యాపారానికి విఘాతం కలిగిస్తాయని ఆందోళన వ్యక్తం చేశారు. జెబ్ పే సీఈవో అజీత్ ఖురానా మాట్లాడుతూ... ‘‘మా కస్టమర్లు, మనదేశానికి ఏది మంచిదో అదే చేస్తాం. ప్రస్తుత పరిస్థితిని పరిశీలించిన తర్వాతే స్పందిస్తాం’’ అని ట్వీట్ చేశారు. అయితే ఉన్నట్టుండి ఆర్ బీఐ ఆదేశాల కారణంగా బ్యాంకు సర్వీసులు నిలిచిపోతూ డిపాజిట్లు చేసిన వారికి, ఉపసంహరించుకునే వారికి సేవలు అందించలేని పరిస్థితి ఏర్పడుతుందన్నారు.

  • Loading...

More Telugu News