Chandrababu: ఏదో చేస్తానన్న పవన్ కల్యాణ్ ఏమయ్యారు: చంద్రబాబు

  • అవిశ్వాసం పెడితే ఢిల్లీకి వెళ్తానన్నారు
  • మద్దతు కూడగడతానని చెప్పి కనిపించడం లేదు
  • బీజేపీకి అనుకూలంగా మారిన పవన్
  • విమర్శలు గుప్పించిన చంద్రబాబునాయుడు

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వని కేంద్ర ప్రభుత్వంపై అవిశ్వాసం పెడితే, చర్చకు అవసరమైన సభ్యుల కోసం ఢిల్లీకి వెళ్లి ఇతర పార్టీలతో చర్చలు జరిపి మద్దతు కూడగడతానని చెప్పిన పవన్ కల్యాణ్ ఏమై పోయారని ఏపీ సీఎం చంద్రబాబు ప్రశ్నించారు. ఏదో చేస్తానన్న పవన్, ఇప్పుడు కనిపించకుండా పోయారని, బీజేపీకి అనుకూలంగా మారి తనను విమర్శిస్తున్నారని ఆరోపించారు. హోదా కోసం రాష్ట్రంలోని ప్రజలు, పార్టీలన్నీ ఒకే తాటిపై ఉన్నామన్న సంకేతాలను పంపాల్సిన సమయంలో, చేపట్టాల్సిన నిరసనలు, ఒత్తిడి పెంచేందుకు వ్యూహాలపై తాను సలహాలు కోరితే, ఒక్క పార్టీ కూడా రాలేదని ఆయన విమర్శలు గుప్పించారు.

 తన తొలి అఖిలపక్ష సమావేశానికి హాజరైన కాంగ్రెస్, రెండో సమావేశానికి రాలేదని, ప్రతి విషయాన్నీ రాజకీయ కోణంలోనే ఆలోచిస్తున్నారు తప్ప, రాష్ట్ర ప్రయోజనాలను ఎవరూ పట్టించుకోవడం లేదని అన్నారు. ప్రధాన రాజకీయ పార్టీలు తనతో కలవక పోయినా, ప్రజా సంఘాలు, సంస్థలు, ఉద్యోగ సంఘాలను ఏకతాటిపైకి తెచ్చి ప్రజల్లోకి వెళతామని అన్నారు. నేడు ప్రదాని ఇంటివద్ద ధర్నా చేయాలని నిర్ణయించామని, ఇందుకు ప్రతి ఒక్కరూ సహకరించాలని కోరారు. కేంద్రంపై పోరాటాన్ని ఉద్ధృతం చేసేందుకు ఓ సమన్వయ కమిటీ, మరో కార్యనిర్వాహక కమిటీని ఏర్పాటు చేయనున్నట్టు చెప్పారు.

  • Loading...

More Telugu News