arun jaitley: ఎయిమ్స్ లో చేరిన అరుణ్ జైట్లీ... నేడు మూత్ర పిండాల మార్పిడి చికిత్స
- శస్త్రచికిత్స కోసం అన్ని ఏర్పాట్లు పూర్తి
- నిన్న సాయంత్రమే ఇంటి నుంచి ఆస్పత్రికి తరలింపు
- డాక్టర్ సందీప్ గులేరియా ఆధ్వర్యంలో చికిత్స
మూత్రపిండాల మార్పిడి చికిత్స కోసం కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ (65) ఎయిమ్స్ లో చేరారు. అన్నీ సాధారణంగా ఉంటే ఈ రోజే ఆయనకు మూత్రపిండాల మార్పిడి శస్త్రచికిత్స జరగనుంది. వైద్యుల సూచన మేరకు వారం రోజులుగా జైట్లీ అధికారిక కార్యకలాపాలకు దూరంగా ఉంటున్నారు. ఇంట్లోనే విశ్రాంతి తీసుకుంటూ కేవలం ముఖ్యమైన వ్యవహారాలను పర్యవేక్షిస్తున్నారు. మూత్రపిండాలకు ఇన్ఫెక్షన్ సోకే ముప్పు ఉందని వైద్యులు హెచ్చరించడంతో ఇంటికే పరిమితం అయ్యారు. నిన్న సాయంత్రం ఆయన్ను చికిత్స కోసం ఎయిమ్స్ కు తరలించారు. నేడు శస్త్రచికిత్స నిర్వహించేందుకు వీలుగా అన్ని ఏర్పాట్లు చేశారు. అపోలో హాస్పిటల్స్ కు చెందిన ప్రముఖ వైద్యుడు డాక్టర్ సందీప్ గులేరియా ఆధ్వర్యంలో వైద్య బృందం శస్త్రచికిత్స నిర్వహించనుంది. సందీప్ గులేరియా ఎయిమ్స్ డైరెక్టర్ రణదీప్ గులేరియా సోదరుడు.