Chandrababu: చంద్రబాబుపై తీవ్ర వ్యాఖ్యలు చేసిన వైఎస్ జగన్!
- ఏపీకి అన్యాయం చేసిన చంద్రబాబు ఓ బావిలో దూకడం బెటర్
- బాబు వెన్నుపోటు పొడవని పార్టీ లు, నేతలు ఎవ్వరూ లేరు
- చంద్రబాబు పుట్టింది 4వ నెల 20వ తేదీ..అంటే ‘420’
- నియంత హిట్లర్, చంద్రబాబుల మనస్తత్వాలు ఒకటే
టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడిపై వైసీపీ అధినేత జగన్ మరోమారు తీవ్ర వ్యాఖ్యలు చేశారు. గుంటూరు జిల్లా సంగం జాగర్లమూడిలో ఈ రోజు రాత్రి ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, ఏపీకి తీరని అన్యాయం చేసిన చంద్రబాబు ఓ బావి చూసుకుని దూకడం బెటర్ అని అన్నారు.
సీఎం హోదాలో చంద్రబాబు ఢిల్లీ వెళితే ముఖ్య నేతలెవ్వరూ ఆయన్ని కలిసేందుకు రాలేదని, బాబు వెన్నుపోటు పొడవని పార్టీలు, నేతలు ఎవ్వరూ లేరని ఘాటు వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు అవినీతిపై కేంద్రం విచారణ జరిపిస్తుందన్న భయంతోనే తమ ఎంపీలతో రాజీనామాలు చేయించలేదని, ప్రత్యేకహోదాను మరోమారు తాకట్టు పెట్టారని అన్నారు. స్వార్థం, లాభం కోసం చంద్రబాబు ఏదైనా చేస్తారని, బహుశ ఆయన పుట్టిన గ్రహబలం అలాంటిదేమోనని విమర్శించిన జగన్, చంద్రబాబు పుట్టింది 4వ నెల 20వ తేదీన, అంటే.. ‘420’ అని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. నియంత హిట్లర్, చంద్రబాబుల మనస్తత్వాలు ఇంచుమించుగా ఒకటేననంటూ విరుచుకుపడ్డారు.