Chandrababu: వైసీపీ నేతలు ఎప్పుడేం చేస్తారో వారికే తెలియదు: చంద్రబాబు
- అఖిలపక్ష సమావేశం నిర్వహిస్తే బీజేపీ, వైసీపీ రాలేదు
- బీజేపీ తప్పు చేసింది కాబట్టి రాలేదు
- అవిశ్వాసం పెట్టామని అనిపించుకోవాలని వైసీపీ నాటకాలు
తాను ఇటీవల అఖిలపక్ష సమావేశం నిర్వహించానని, ఆ సమావేశానికి బీజేపీ, వైసీపీ పార్టీల నేతలు రాలేదని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. కేంద్ర ప్రభుత్వం విభజన హామీలు అమలు చేయాలని ఈ రోజు శాసనసభలో చంద్రబాబు తీర్మానం ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా ఆయన ప్రసంగిస్తూ... బీజేపీ తప్పు చేసింది కాబట్టి అఖిలపక్ష సమావేశానికి రాలేదని, వారే ఈ రోజు రాష్ట్రానికి అన్యాయం చేస్తున్నారు కాబట్టి వారికి రావడానికి మొహం చెల్లలేదని వ్యాఖ్యానించారు.
చట్టంలో ఉన్నవి ఎందుకు అమలు చేయలేదో చెప్పాలని గట్టిగా నిలదీస్తే సమాధానం చెప్పలేకపోతున్నారని చంద్రబాబు అన్నారు. ఇక వైసీపీ నేతలు ఏం చేస్తున్నారో, ఏం మాట్లాడతారో వారికే తెలియదని చంద్రబాబు అన్నారు. ఐదుగురు ఎంపీలతో అవిశ్వాస తీర్మానం పెట్టామని అంటారని, అవిశ్వాసం పెట్టామని ప్రజలతో అనిపించుకోవాలని నామ మాత్రంగా పెట్టారని దానిపై చర్చ జరిగేలా చేయడానికి వైసీపీ ఏమీ చేయలేదని అన్నారు.
తాము ఎన్డీఏ కూటమి నుంచి బయటకు రాగానే అవిశ్వాస తీర్మానం పెట్టామని, ఢిల్లీలో పోరాడుతున్నామని చంద్రబాబు చెప్పారు. ఆయా పార్టీల నేతలు అఖిలపక్ష సమావేశానికి ఎందుకు రారో వారికే తెలియాలని, తాము కేంద్ర ప్రభుత్వంపై పోరాడుతోంటే, రాజకీయ ప్రయోజనాల కోసం ప్రతిపక్ష పార్టీలు మీనమేషాలు లెక్కిస్తున్నాయని అన్నారు.