Andhra Pradesh: అమరావతిలో సైకిలెక్కిన చంద్రబాబునాయుడు!
- హోదా కోసం ఏపీ సీఎం నిరసన
- వెంకటపాలెం నుంచి అసెంబ్లీకి సైకిల్ పై యాత్ర
- అనుసరించిన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు
- మరింతగా ఉద్యమిస్తామని చంద్రబాబు హెచ్చరిక
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా సాధనకోసం కేంద్రంలోని ఎన్డీయే సర్కారుపై తాను చేస్తున్న ఉద్యమాన్ని తీవ్రతరం చేసిన సీఎం చంద్రబాబునాయుడు, ఈ ఉదయం అమరావతిలో సైకిల్ యాత్ర చేశారు. పార్లమెంట్ సమావేశాల్లో అవిశ్వాసం, రాష్ట్రానికి జరిగిన అన్యాయంపై చర్చకు కేంద్రం నిరాకరిస్తున్న వైఖరిని తూర్పారబడుతూ, వెంకటపాలెం నుంచి అమరావతి వరకూ సైకిల్ పై వెళ్లి నిరసన తెలిపారు. కొద్దిసేపటి క్రితం వెంకటపాలెం గ్రామ నడిబొడ్డున ఉన్న ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించిన ఆయన, అసెంబ్లీ వరకూ సైకిల్ పై బయలుదేరగా, పలువురు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, టీడీపీ నేతలు, కార్యకర్తలు ఆయనను అనుసరించారు.
ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ, పార్లమెంట్ లో తెలుగుదేశం పార్టీ ఎంపీలు వీరోచిత పోరాటం చేస్తున్నారని, వారికి ప్రజలంతా మద్దతివ్వాలని కోరారు. ఎంపీల పోరాటాన్ని 5 కోట్ల మంది ఆంధ్రులు అభినందిస్తున్నారని తెలిపారు. ఒక సంకల్పంతో తాము చేస్తున్న పోరాటంలో విజయం సాధించాలంటే ప్రజల మద్దతు ఎంతైనా అవసరమని చంద్రబాబు అన్నారు. టీడీపీ చేస్తున్న పోరాటంలో ఓ చిత్తశుద్ధి ఉందని, లక్ష్యసిద్ధి కోసం పోరాడుతున్నామని తెలిపారు.
హోదా సాధన ప్రతి ఒక్కరి విధి, కర్తవ్యం, బాధ్యతగా భావించాలని చంద్రబాబు సూచించారు. నిన్న రాజ్యసభలో టీడీపీ ఎంపీల మెరుపు ధర్నాతో జాతీయ స్థాయిలో ప్రకంపనలు వచ్చాయని, తమ నిరసనలను కొనసాగిస్తామని స్పష్టం చేశారు. ఢిల్లీలో ఎంపీల పోరు రాష్ట్ర ప్రజలను చైతన్యపరిచిందని, నేడు పార్లమెంట్ చివరి రోజున మరింత ఉద్ధృతంగా నిరసనలు తెలియజేయనున్నామని చంద్రబాబునాయుడు తెలియజేశారు.