employeement: దుబాయ్ లో ఉద్యోగాలంటూ నా భార్య వ్యభిచారానికి పంపిస్తోంది: గుంటూరు పోలీసులకు ఓ వ్యక్తి ఫిర్యాదు
- విదేశాల్లో ఉపాధి ముసుగులో యువతులకు మాయమాటలు చెప్పి దుబాయ్ పంపిన రెబ్బమ్మ
- దుబాయ్ వెళ్లిన వారిని బలవంతంగా వ్యభిచారంలో దింపే రెబ్బమ్మ చెల్లెలు ఆషికీ
- కొన్నేళ్లుగా దుబాయ్ లో వ్యభిచారం దందా నడుపుతున్న ఆషికీ
భార్యాభర్తల వ్యక్తిగత వివాదం.. ఉపాధి ముసుగులో విదేశాల్లో జరిగే దారుణాన్ని వెలుగులోకి తెచ్చింది. పోలీసులు తెలిపిన దాని వివరాల్లోకి వెళ్తే... గుంటూరు జిల్లా పిడుగురాళ్లకు చెందిన మస్తాన్ వలి, ఆషాభి (రెబ్బమ్మ) భార్యాభర్తలు. మనస్పర్ధల కారణంగా విడిపోయిన వీరిద్దరూ పరస్పరం కేసులు పెట్టుకున్నారు. ఈ క్రమంలో మస్తాన్ వలి తన భార్య విదేశీ ఉద్యోగాల పేరిట యువతులకు వల వేసి, వారిని వ్యభిచారంలోకి దింపే తతంగాన్ని పోలీసులకు వివరించాడు. పిడుగురాళ్ల పరిసరాల్లోని యువతులకు విదేశాల్లో ఉద్యోగాలు ఇప్పిస్తానని మాయమాటలు చెప్పి, వారి నుంచి నగదు వసూలు చేసి దుబాయ్ పంపుతుందని తెలిపాడు.
అక్కడికి వెళ్లిన తరువాత ఉద్యోగం అసలు రంగు తెలుస్తుందని అన్నాడు. అక్కడ తన భార్య చెల్లెలు ఆషికీ వారిని బలవంతంగా వ్యభిచారంలోకి దింపుతుందని పేర్కొన్నాడు. దీంతో రెబ్బమ్మను పోలీస్ స్టేషన్ కు పిలిచి విచారించగా, పలు కీలక విషయాలు వెలుగు చూశాయి. దుబాయ్ లో ఉంటున్న ఆషికీ కొన్నేళ్లుగా దుబాయిలో రాజమండ్రికి చెందిన నందు అనే వ్యక్తితో సహజీవనం చేస్తోందని తెలిపింది. ఇక్కడి నుంచి దుబాయ్ పంపే ఆడపిల్లలను మోసం చేస్తూ వారిచే బలవంతంగా వ్యభిచారం చేయిస్తున్నట్లు తేలింది.
ఈ క్రమంలోనే అక్కడకు వెళ్లిన వారిలో కొందరు వ్యభిచారం చేయడం ఇష్టం లేక తిరిగి పిడుగురాళ్లకు రాగా, ఒక మహిళ తాను జూన్ లో వెళ్లి జనవరిలో వచ్చానని, కుటుంబ పరిస్థితుల నేపథ్యంలో నెలకు 25 వేలు ఇస్తానని చెప్పి, తనతో బలవంతంగా 7 నెలల పాటు వ్యభిచారం చేయించి, చిల్లిగవ్వ కూడా ఇవ్వకుండా మోసం చేశారని తెలిపింది. దీంతో దుబాయ్ పోలీసులను సంప్రదించి, వారి సాయంతో తాను పిడుగురాళ్ల చేరుకున్నానని తెలిపింది.
దీంతో అక్కాచెల్లెళ్లపై కేసు నమోదు చేసిన పోలీసులు, దర్యాప్తు చేపట్టారు. దుబాయ్ నుంచి వచ్చిన పలువురు మహిళల నుంచి దీనికి సంబంధించిన వివరాలు సేకరిస్తున్నారు. మరో పదిమంది మహిళలను దుబాయ్ కి పంపేందుకు రెబ్బమ్మ వీసాలు సిద్ధం చేసినట్లు గుర్తించారు.