shilpa chakravarthi: ఆ రోజు జరిగిన అవమానాన్ని ఎప్పటికీ మరిచిపోలేను: శిల్పా చక్రవర్తి
- తొలినాళ్లలో నాకు తెలుగు సరిగ్గా రాదు
- అందువలన ఇబ్బందులు పడ్డాను
- కొంతమందితో మాటలు పడ్డాను
యాంకర్ గా .. నటిగా మంచి గుర్తింపు తెచ్చుకున్న శిల్పా చక్రవర్తి తాజాగా ఐ డ్రీమ్స్ తో మాట్లాడుతూ, తన కెరియర్ కి సంబంధించిన కొన్ని విషయాలను పంచుకున్నారు. "ఆరంభంలో తెలుగు సరిగ్గా రాక నేను చాలా ఇబ్బందులు పడ్డాను .. అవమానాలను ఎదుర్కొన్నాను. 'కంటే కూతుర్నే కనాలి' అనే సీరియల్ చేస్తుండగా ఒక సంఘటన జరిగింది. ఆ రోజు రాత్రి టెలికాస్ట్ కావలసిన ఎపిసోడ్ .. సాయంత్రం షూటింగు జరుపుకుంటోంది. అసలే ఒక వైపున సమయం లేదనే టెన్షన్ లో వుంటే, నాకు పేజీల కొద్దీ డైలాగ్స్ రాసి .. చెప్పమన్నారు"
"నాకు ప్రాంమ్టింగ్ అలవాటు లేదు .. ఒకటికి రెండు సార్లు చదువుకుని చెప్పేస్తాను .. కానీ నాకు అంత సమయం ఇవ్వలేదు. డైలాగ్ పేపర్స్ కోసం కో డైరెక్టర్ ను అడిగితే ఆయన ఇవ్వకపోగా, ' ఇలాంటి వాళ్లను తీసుకొస్తారేంటండీ .. తెలుగు రానివాళ్లను మా నెత్తిమీద రుద్దుతారు. మేం షాట్స్ చూసుకోవాలా .. డైరెక్టర్ చెప్పేవి చెయ్యాలా .. నీలా భాష రానివాళ్లకు నేర్పించుకుంటూ కూర్చోవాలా?' అంటూ అంతమందిలో అరిచాడు. ఆ అవమానాన్ని నేను తట్టుకోలేకపోయాను .. మరిచిపోలేకపోయాను" అంటూ చెప్పుకొచ్చారు.