BJP: కర్ణాటకలో బీజేపీకి మరో తలనొప్పి.. ప్రత్యేక రాష్ట్రం ఇస్తేనే ఓటు వేస్తామంటున్న కొడవ నేషనల్ కౌన్సిల్!
- ప్రత్యేక రాష్ట్రం కోసం దశాబ్దాలుగా కొడవల పోరాటం
- కన్నడిగులతో కలసి ఉండలేమంటున్న కొడవలు
- కొడవల డిమాండ్ తో బీజేపీకి ముచ్చెమటలు
కర్ణాటకలో ఎలాగైనా అధికార పీఠాన్ని కైవసం చేసుకోవాలని విశ్వప్రయత్నం చేస్తున్న బీజేపీకి... మరో తలనొప్పి ఎదురైంది. తమకు ప్రత్యేక కొడగు రాష్ట్రాన్ని ప్రకటించాలని కొడవ నేషనల్ కౌన్సిల్ డిమాండ్ చేస్తోంది. ప్రత్యేక రాష్ట్రం కోసం సుదీర్ఘకాలంగా కొడగు జిల్లా ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. రెండు శాసనసభ నియోజకవర్గాలు ఉన్న కొడగు జిల్లాలో ప్రత్యేక రాష్ట్రం కోసం దశాబ్దాలుగా పోరాటం జరుగుతోంది.
కన్నడిగులతో తాము కలసి ఉండలేమని... తమ భాష, సంప్రదాయాలు, సంస్కృతి వేరని వారు చెబుతున్నారు. గత ఎన్నికల్లో ఈ జిల్లాలోని రెండు స్థానాలను బీజేపీ కైవసం చేసుకుంది. తాజాగా కొడవ నేషనల్ కౌన్సిల్ అధ్యక్షుడు ఎన్.యు.నాచప్ప మాట్లాడుతూ, కొడవలకు ప్రత్యేక రాష్ట్రం ఇస్తేనే తాము బీజేపీకి ఓటు వేస్తామని తేల్చి చెప్పారు. ఇదే విషయాన్ని ఆయన బీజేపీ పెద్దలకు స్పష్టం చేశారు. కౌన్సిల్ నిర్ణయంతో బీజేపీకి ముచ్చెమటలు పడుతున్నాయి.