youtube: యూట్యూబ్ హెడ్‌క్వార్టర్స్‌లో కాల్పులు.. దాడి అనంతరం తనను తాను కాల్చుకున్న మహిళ
- లంచ్ సమయంలో కాల్పులు జరిపిన మహిళ
- నలుగురికి తీవ్ర గాయాలు.. ఇద్దరి పరిస్థితి విషమం
- గృహ సంబంధ వివాదాలే కాల్పులకు కారణమంటున్న పోలీసులు
శాన్‌ఫ్రాన్సిస్కోలోని యూట్యూబ్ హెడ్‌క్వార్టర్స్‌లో మంగళవారం ఓ మహిళ (30) విచక్షణా రహితంగా కాల్పులు జరిపింది. ఈ ఘటనలో నలుగురు ఉద్యోగులు తీవ్రంగా గాయపడ్డారు. కాల్పుల అనంతరం మహిళ తనను తాను కాల్చుకుని ప్రాణాలు తీసుకుంది. కాల్పుల శబ్దం విని ఏం జరుగుతోందో తెలియక ఉద్యోగులు సమీపంలోని వీధుల్లోకి పరుగులు తీశారు.
సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనా స్థలికి చేరుకుని క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు. వీరిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. లంచ్ సమయంలో మహిళ క్యాంపస్‌లోని డాబా మీదకు చేరుకుని కాల్పులు ప్రారంభించింది. అనంతరం తనను తాను కాల్చుకుంది. మొత్తం పది రౌండ్లు ఆమె కాల్చినట్టు పోలీసులు తెలిపారు. గృహ సంబంధమైన వివాదాలతోనే ఆమె ఈ పనికి పాల్పడినట్టు పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ ఘటన వెనక ఉగ్రవాద కోణం లేదని తేల్చి చెప్పారు.
ఈ ఘటనకు సంబంధించి యూట్యూబ్ ప్రొడక్ట్ మేనేజర్ టాడ్ షేర్మన్ ట్విట్టర్‌లో స్పందిస్తూ ఉద్యోగులు బయటకు పరుగులు పెడుతుంటే భూకంపం వచ్చిందని అనుకున్నానని, కానీ ఓ మహిళ కాల్పులకు పాల్పడినట్టు తర్వాత తెలిసిందని చెప్పారు. కాల్పుల ఘటనపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కూడా స్పందించారు. బాధితులకు సంఘీభావం తెలిపారు.