pugs: దయచేసి మీ ప్రకటనల కోసం పగ్ కుక్కల్ని బాధించకండి... వొడాఫోన్ కు పెటా సూచన
- అవి సాధారణ కుక్కలు కావు
- జన్యుపరంగా మార్పులు చేసినవి
- శారీరకంగా ఎన్నో బాధలు అనుభవిస్తుంటాయి
- ఏ జంతువును కూడా ప్రకటనల కోసం వాడుకోవద్దు
- వొడాఫోన్ ను లేఖ ద్వారా కోరిన పెటా
ప్రముఖ టెలికం సంస్థ వొడాఫోన్ (గతంలో హచ్) పొట్టి కుక్కతో చేసిన టీవీ యాడ్ చాలా మందికి గుర్తుండే ఉంటుంది. ఇందులో కనిపించిన కుక్క పగ్ జాతికి చెందినది. నాటి యాడ్ ప్రజల్లోకి చొచ్చుకుపోవడంతో వొడాఫోన్ ఇండియా తాజాగా 30 పగ్స్ కుక్కలతో ఓ వీడియో ప్రకటనను రూపొందించింది. దీనిపై జంతు హక్కుల సంరక్షణ సంస్థ పెటా వొడాఫోన్ కు ఓ అభ్యర్థన చేసింది. దయచేసి ప్రకటనల్లో పగ్ కుక్కలను వినియోగించొద్దని కోరింది. అవి సాధారణ కుక్కలు కావని గుర్తు చేసింది. ఈ మేరకు వొడాఫోన్ ఇండియా సీఈవో సునీల్ సూద్ కు పెటా ఓ లేఖ రాసింది.
‘‘పగ్స్ అన్నవి చూడ్డానికి చాలా అందంగా ఉండేందుకు జన్యుపరంగా మార్పులు చేసి రూపొందించిన జాతి. ఈ విధమైన నిర్మాణం వల్ల అవి నిరంతరం నొప్పిని అనుభవిస్తూ, శ్వాస తీసుకునేందుకు ఇబ్బంది పడుతుంటాయి. జన్యుపరంగా చేసిన మార్పుల కారణంగా అవి చిన్న ముక్కులు, చర్మం ముడతలతో కనిపిస్తాయి’’ అని లేఖలో పెటా వివరించింది. ‘మీ వాణిజ్య ప్రకటనల వల్లే భారత్ లో వీటికి ఆదరణ లభించిందంటూ, వాటి గురించి భారతీయులు తెలుసుకోగలిగారని’ అందుకు ధన్యవాదాలు కూడా తెలియజేసింది.
పగ్స్ సహా ఏ జంతువును కూడా ప్రకటనల్లో వాడకుండా ఓ విధానాన్ని తీసుకురావాలని వొడాఫోన్ ను కోరింది. పగ్స్, జంతువులను వినోదం కోసం వినియోగించడం వల్ల, షూటింగ్ సమయాల్లో పెద్ద శబ్దాలు, అధిక కాంతితో కూడిన లైట్లు, లెక్కకు మించిన షాట్లను అవి ఎదుర్కోవాల్సి ఉంటుందని పెటా సీఈవో మనీలాల్ వాలియెత్ గుర్తు చేశారు.