pasunuti aravind: ఎమ్మెల్యే కుమారుడి బెదిరింపులతో మంచిర్యాలలో కుటుంబం ఆత్మహత్యాయత్నం... కాపాడిన స్థానికులు!

  • అరవింద్ కు బాకీ పడిన ఎమ్మెల్యే కుమారుడు
  • డబ్బు చెల్లించాలని కోరడంతో బెదిరింపులు
  • బెదిరింపులకు తాళలేక కుటుంబంతో ఆత్మహత్యాయత్నం

రుణం తిరిగి చెల్లించాలని కోరడంతో చెన్నూరు ఎమ్మెల్యే, తెలంగాణ ప్రభుత్వ విప్ నల్లాల ఓదెలు కుమారుడు క్రాంతి బెదిరింపులకు దిగుతున్నాడని ఆరోపిస్తూ కుటుంబం ఆత్మహత్యాయత్నం చేయడం మంచిర్యాలలో కలకలం రేపింది. దాని వివరాల్లోకి వెళ్తే.. మంచిర్యాలలో బోర్ వెల్స్ వ్యాపారంతో పాటు షాపింగ్ మాల్ వ్యవహారంలో చెన్నూరు ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ నల్లాల ఓదెలు కుమారుడు క్రాంతి తమకు సుమారు రెండు కోట్ల రూపాయలు రుణపడి ఉన్నాడని పసునూరి అరవింద్ తెలిపారు.

ఆ మొత్తం తిరిగి చెల్లించాలని డిమాండ్ చేయడంతో బెదిరింపులు, వేధింపులకు దిగుతున్నాడని అరవింద్ ఆరోపించారు. అతనిపై పోలీసులకు ఫిర్యాదు చేసినా ఎలాంటి ఉపయోగం ఉండడం లేదని పేర్కొంటూ భార్య సువర్ణ, కుమారుడితో కలిసి అరవింద్ రైలు కిందపడి ఆత్మహత్య చేసుకోవాలని భావించారు. రైల్వే ట్రాక్ పై రైలుకు ఎదురెళ్తున్న కుటుంబాన్ని చూసిన స్థానికులు వారిని అడ్డగించి, పోలీసులకు సమాచారం అందించారు. దీంతో వారిని అదుపులోకి తీసుకున్న పోలీసులు వారికి కౌన్సిలింగ్ నిర్వహించారు. అనంతరం వారి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి, దర్యాప్తు ప్రారంభించారు.

  • Loading...

More Telugu News