Telangana: రైతులను కడుపులో పెట్టుకుంటా : మంత్రి హరీశ్ రావు

  • సిద్దిపేట జిల్లాలో దెబ్బతిన్న పంటలను పరిశీలించిన హరీశ్ రావు
  • అధైర్య పడకండి. అండగా ఉంటాం
  • పంట పెట్టుబడి, నష్టపరిహారం ఒకేసారి అందిస్తాం
  • పంట నష్టంపై రెండురోజుల్లోగా నివేదిక అందించాలి

 తెలంగాణలో రైతులను కడుపులో పెట్టుకుంటానని, ఎవరూ అధైర్య పడవద్దని మంత్రి హరీశ్ రావు భరోసా ఇచ్చారు. అకాల వర్షాలు, వడగండ్ల వానకు దెబ్బతిన్న పంటలను హరీశ్ రావు సోమవారం సాయంత్రం పరిశీలించారు. సిద్దిపేట జిల్లాలో రెండు రోజులుగా కురుస్తున్న వడగండ్ల వానలకు పలు గ్రామాల్లో పంటలకు నష్టం వాటిల్లింది. నాంచారుపల్లి, బక్రిచెప్యాల, ఎల్లుపల్లి గ్రామాల్లో నష్టపోయిన పంటలను పరిశీలించారు. ఈ సందర్భంగా రైతులతో హరీశ్ రావు మాట్లాడుతూ, అన్నదాతలకు అండగా ఉంటామని, వచ్చే వానాకాలంలో వేసే పంట వరకు సహాయం అందిస్తామని తెలిపారు. పంట పెట్టుబడి, నష్టపరిహారం ఒకేసారి చెల్లిస్తామని చెప్పారు. ప్రభుత్వం ఈ సంవత్సరం రెండు పంటలకు ఇచ్చే 8000 పెట్టుబడి సాయంతో పాటు ఇన్ ఫుడ్ సబ్సిడీ సహాయం కూడా ఒకేసారి అందిస్తామని చెప్పారు. వడగండ్ల వాన కారణంగా రైతులకు వాటిల్లిన నష్టం గురించి సీఎం కేసీఆర్ కు చెబుతానని అన్నారు. కాగా, రెండు రోజులుగా తొమ్మిది మండలాల్లో 60 గ్రామాల్లో పంటలకు భారీగా నష్టం జరిగింది. ప్రాథమిక అంచనా ప్రకారం 2611 హెక్టార్లలో వరి, 300 హెక్టార్లలో కూరగాయలు, 800 హెక్టార్లలో మామిడిపంటకు నష్టం జరిగినట్టు అధికారులు చెబుతున్నారు. మండలాల వారీగా, గ్రామాలు, రైతుల వారీగా నివేదిక సిద్ధం చేయాలని హరీశ్ రావు ఆదేశించారు. నష్టపోయిన అన్ని పంటలకు ప్రభుత్వం నష్టపరిహారం చెల్లిస్తుందని, వరి పంటకు క్రాప్ లోన్ తీసుకున్న వారికి ఇన్సూరెన్స్ వచ్చేలా చేస్తానని, సంబంధిత ఐసీఐసీఐ బ్యాంక్ అధికారులతో కూడా  రైతుల సమక్షంలోనే హరీశ్ రావు మాట్లాడారు. మంత్రి వెంట సిద్ధిపేట జిల్లా కలెక్టర్ వెంకట్రామిరెడ్డి, రెవెన్యూ, వ్యవసాయ అధికారులు ఉన్నారు. 

  • Loading...

More Telugu News