bihar: ఇంగ్లీషులో ప్రశ్నించిన విద్యార్థి.. అర్థంగాక చితక్కొట్టిన పోలీసులు!

  • ద్విచక్రవాహనం దొంగతనం చేశాడన్న ఆరోపణలతో వ్యక్తి అరెస్టు
  • ఆయనను విడిపించేందుకు వెళ్లిన ఇంటర్ విద్యార్థి అభిషేక్ 
  • పత్రాలు చూపించినా విడుదల చేయకపోవడంతో ఇంగ్లిష్ లో నిలదీసిన అభిషేక్

ఆధారాలన్నీ చూపించిన తరువాత కూడా తన అంకుల్ ను ఎందుకు జైల్లో ఉంచారని ఇంగ్లీషులో ప్రశ్నించడం ఇంటర్ విద్యార్థి పాలిట శాపంగా మారి మూడు రోజులపాటు పోలీస్ స్టేషన్ పాలైన ఘటన బీహార్ లో చోటుచేసుకుంది. ఈ ఘటన వివరాల్లోకి వెళ్తే... బీహార్‌ లోని ఖగారియా జిల్లాలో ద్విచక్రవాహనం దొంగతనం చేశాడన్న ఆరోపణలతో ఒక వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు. ఆయనను విడిపించేందుకు బంధువైన ఇంటర్ విద్యార్థి అభిషేక్‌ కుమార్‌ ఆ ద్విచక్రవాహనానికి సంబంధించిన పత్రాలను తీసుకుని స్టేషన్ కు వెళ్లాడు. ఆ వాహనం తన అంకుల్‌ దేనని నిరూపించాడు.

 అయినప్పటికీ ఆయనను విడుదల చేసేందుకు పోలీసులు నిరాకరించడంతో ఆగ్రహానికి గురైన అభిషేక్..‘ఇన్ని ఆధారాలు చూపించిన తరవాత కూడా ఎందుకు అంకుల్‌ ను జైల్లోనే ఉంచారు?’ అంటూ ఇంగ్లీష్ లో ప్రశ్నించాడు. అతను ఇంగ్లీష్ లో చెప్పిన దానిని అర్థం చేసుకోలేకపోయిన పోలీసులు, తీవ్రఆగ్రహానికి గురై, అభిషేక్ ను మూడు రోజుల పాటు లాకప్ లో వేసి లాఠీ దెబ్బల రుచిచూపించారు.

పర్యవసానంగా అభిషేక్ కాలు, నడుంకు గాయాలై ఆసుపత్రి పాలయ్యాడు. దీంతో పోలీసుల తీరుపై సర్వత్ర విమర్శలు రావడంతో దీనికి కారణమైన ఇద్దరు పోలీసులను ఉన్నతాధికారులు విధుల నుంచి తప్పించారు. దీనిపై అభిషేక్ మీడియాతో మాట్లాడుతూ, ‘నేను అడిగిన ప్రశ్న వారికి అర్థం కాలేదు. ఇంగ్లీషులో ప్రశ్నించడంతో నేను గర్వంగా మాట్లాడానని భావించారు. అందుకే మూడు రోజులు లాకప్ లో పెట్టి, కొట్టారు' అని వాపోయాడు.

  • Loading...

More Telugu News