KTR: మా కుటుంబంలోని చిన్న పిల్లలను కూడా తిడుతున్నారు: కాంగ్రెస్‌పై కేటీఆర్ ఫైర్‌

  • కుటుంబ పాలన గురించి కాంగ్రెస్ నేతలు మాట్లాడడం హాస్యాస్పదం
  • కాంగ్రెస్ నేతలకు అసలు సిగ్గుందా?
  • ఆ పార్టీ హయాంలో రైతుల పరిస్థితి దయనీయంగా ఉండేది

గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో మంత్రులుగా పనిచేసి తెలంగాణకు ఏమీ చేయలేకపోయిన కాంగ్రెస్ నేతలు ఈ రోజు తమను విమర్శిస్తున్నారని, తమపై వ్యక్తిగత విమర్శలు కూడా చేస్తున్నారని తెలంగాణ మంత్రి కేటీఆర్ అన్నారు. చివరికి సీఎం కేసీఆర్ మనవడు, మనవరాళ్లను కూడా తిడుతున్నారని, తమ కుటుంబంలోని చిన్న పిల్లలను కూడా తిట్టడమేంటని ప్రశ్నించారు. ఈ రోజు ఆయన వనపర్తిలో నిర్వహించిన ఓ బహిరంగసభలో పాల్గొని మాట్లాడారు. తెలంగాణలో కుటుంబ పాలన ఉందని కాంగ్రెస్ నేతలు అంటున్నారని, కుటుంబ పాలన గురించి ఆ పార్టీ నేతలు మాట్లాడడం హాస్యాస్పదంగా ఉందని ఎద్దేవా చేశారు. కుటుంబ పాలన గురించి మాట్లాడడానికి కాంగ్రెస్ నేతలకు ఏమైనా సిగ్గుందా? అని కేటీఆర్ వ్యాఖ్యానించారు.

'మోతీలాల్ నెహ్రూ కొడుకు జవహర్ లాల్ నెహ్రూ, జవహర్ లాల్ నెహ్రూ కూతురు ఇందిరా గాంధీ, ఇందిరా గాంధీ కొడుకు రాజీవ్ గాంధీ, రాజీవ్ గాంధీ భార్య సోనియా గాంధీ, వారి కొడుకు రాహుల్ గాంధీ' అని అటువంటి పార్టీకి చెందిన వారు వారసత్వ రాజకీయాల గురించి మాట్లాడుతున్నారని చురకలంటించారు. కాంగ్రెస్ పార్టీ హయాంలో రైతుల పరిస్థితి దయనీయంగా ఉండేదని, రైతులకు 9 గంటల విద్యుత్ ఇస్తామని చెప్పి 6 గంటలే ఇచ్చారని అన్నారు. రైతులకు సమయానికి విత్తనాలు, ఎరువులు కూడా ఇవ్వలేదని, రైతుల కష్టాలు పట్టించుకోలేదని విమర్శించారు. 

  • Loading...

More Telugu News