reliance jio: ఫిబ్రవరిలోనూ జియోనే టాప్... 4జీ డేటా డౌన్ లోడ్ లో మొదటి స్థానం
- 21.3 ఎంబీపీఎస్ గా నమోదు
- అప్ లోడ్ లో మాత్రం ఐడియాకు ప్రథమ స్థానం
- 6.9 ఎంబీపీఎస్ గా నమోదు
- వెల్లడించిన ట్రాయ్
రిలయన్స్ జియో 4జీ డేటా డౌన్ లోడ్ వేగంలో మరోసారి అగ్ర స్థానంలో నిలిచింది. ఫిబ్రవరి నెలకు సంబంధించి టెలికం కంపెనీల 4జీ డేటా స్పీడ్ వివరాలను ట్రాయ్ విడుదల చేసింది. ట్రాయ్ మై స్పీడ్ యాప్ అని ఒకటి ఉంది. యూజర్లు ఎవరైనా సరే దీన్ని తమ స్మార్ట్ ఫోన్లో డౌన్ లోడ్ చేసుకుంటే చాలు. నెట్ వర్క్ డేటా స్పీడ్ ఎంత ఉందన్నది అప్పటిప్పుడు తెలుసుకోవచ్చు. ఈ యాప్ ఆధారంగానే డేటా వేగాన్ని ట్రాయ్ పరిగణనలోకి తీసుకుంటోంది. ఈ విధంగా చూస్తే ఫిబ్రవరిలో డేటా డౌన్ లోడ్ వేగంలో జియో ప్రథమ స్థానంలో ఉంది. ఎయిర్ టెల్ రెండో స్థానంలో, వొడాఫోన్, ఐడియా వేగంలో తర్వాతి స్థానాల్లో ఉన్నాయి.
రిలయన్స్ జియో నెట్ వర్క్ లో 4జీ అప్ లోడ్ వేగం 21.3 ఎంబీపీఎస్ గా నమోదైంది. ఎయిర్ టెల్ డేటా వేగం 8.8ఎంబీపీఎస్, వొడాఫోన్ 7.2 ఎంబీపీఎస్, ఐడియా 6.8 ఎంబీపీఎస్ వేగాన్ని ప్రదర్శించాయి. జనవరిలో జియో డేటా డౌన్ లోడ్ వేగం 19.4 ఎంబీఎస్ గా నమోదు కాగా, ఫిబ్రవరిలో అది కాస్తంత మెరుగుపడడమే కాకుండా ముందు నిలిచింది. ఇక అప్ లోడ్ సమయంలో డేటా వేగంలో ఐడియా అన్నిటికంటే ముందుంది. ఫిబ్రవరి నెలలో ఐడియా 4జీ డేటా అప్ లోడ్ వేగం 6.9 ఎంబీపీఎస్ కాగా, వొడాఫోన్ 5.5 ఎంబీపీఎస్, జియో 4.5 ఎంబీపీఎస్, ఎయిర్ టెల్ 3.9 ఎంబీపీఎస్ వేగంతో తర్వాత ఉన్నాయి.