ola: ఓలా, ఊబర్ ఒక్కటవుతున్నాయి... విలీనంపై రెండు సంస్థల మధ్య చర్చలు
- ఓలాలో ఊబర్ దేశీయ కార్యకలాపాల విలీన అంశం
- దీనిపై రెండు సంస్థల ఉన్నతాధికారుల చర్చలు
- కొన్ని నెలల్లో డీల్ కుదురుతుందంటున్న వర్గాలు
దేశంలో రెండు ప్రధాన క్యాబ్ సేవల సంస్థలు ఓలా, ఊబర్ విలీనం అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఓలా అన్నది దేశీయ సంస్థ. బెంగళూరు కేంద్రంగా ప్రారంభమై దేశవ్యాప్తంగా విస్తరించింది. ఊబర్ అమెరికా కంపెనీ. ఈ రెండింటిలోనూ జపాన్ కు చెందిన సాఫ్ట్ బ్యాంకు భారీగా పెట్టుబడులు పెట్టి ఉంది. దీంతో ఈ రెండింటినీ ఒక్కటి చేస్తే మార్కెట్లో పోటీ ఉండదని, గుత్తాధిపత్యం చలాయించొచ్చన్నది సాఫ్ట్ బ్యాంకు వ్యూహం. ఇందులో భాగంగానే ఈ రెండు సంస్థల విలీనానికి చర్చలు ఏర్పాటు చేసింది.
దీంతో ఇరు సంస్థల ఉన్నతాధికారులు దీనిపై చర్చలు జరుపుతున్నారు. కొన్ని నెలల్లో డీల్ కుదరొచ్చని ఈ వ్యవహారంతో సంబంధం ఉన్న ఓ వ్యక్తి తెలిపారు. ఊబర్ కు చెందిన భారత కార్యకలాపాలను మాత్రమే ఓలా విలీనం చేసుకోనుందని, దీనిపైనే చర్చలు జరుగుతున్నాయని మరో వ్యక్తి మీడియాకు వెల్లడించారు. అయితే, విలీనం తర్వాత మెజారిటీ వాటా తనకుండాలంటే, తనకుండాలంటూ రెండు సంస్థలు డిమాండ్ చేస్తుండడంతో చర్చలు ఓ కొలిక్కి రావడానికి ఆలస్యం అవుతోందని తెలిపారు.