Sachin Tendulkar: గెలవడం కన్నా ఎలా గెలిచామన్నది ముఖ్యం!: 'బాల్ టాంపరింగ్' ఉదంతంపై సచిన్
- క్రికెట్ జెంటిల్ మన్ గేమ్
- నిజాయతీగా ఆడాలని నమ్ముతాను
- క్రికెట్ సమగ్రతను కాపాడే నిర్ణయం తీసుకున్నారు
బాల్ టాంపరింగ్ వివాదానికి పాల్పడిన ఆసీస్ ఆటగాళ్లపై ఐసీసీ, సీఏ చర్యల నేపథ్యంలో ఈ వివాదంపై పలువురు ప్రముఖులు తమ అభిప్రాయాలను పంచుకుంటున్నారు. ఈ నేపథ్యంలో క్రికెట్ దేవుడిగా నీరాజనాలు అందుకున్న టీమిండియా దిగ్గజ ఆటగాడు సచిన్ టెండూల్కర్ కూడా స్పందించాడు.
క్రికెట్ కు జెంటిల్ మన్ గేమ్ గా గుర్తింపు ఉందని గుర్తు చేశాడు. అలాంటి ఆటను నిజాయతీగా ఆడాలని తాను నమ్ముతానని స్పష్టం చేశాడు. సౌతాఫ్రికాతో ఆస్ట్రేలియా సిరీస్ లో చోటుచేసుకున్న సంఘటన దురదృష్టకరమని పేర్కొన్నాడు. ఇలాంటి సమయంలో క్రికెట్ సమగ్రతను కాపాడేందుకు ఐసీసీ, సీఏ సరైన నిర్ణయమే తీసుకున్నాయని సచిన్ అభిప్రాయపడ్డాడు. గెలవడం ముఖ్యమే అయినప్పటికీ, ఆ గెలుపు ఎలా సాధ్యమైందనేది అంతకంటే ముఖ్యమైన అంశమని సచిన్ తెలిపాడు.