Andhra Pradesh: ప్రజలకు విజయసాయిరెడ్డి క్షమాపణలు చెప్పాలి: మంత్రి నారా లోకేశ్
- ఏ -2 నిందితుడికి చంద్రబాబు గురించి మాట్లాడే హక్కు లేదు
- అఖిలపక్ష సమావేశం నిర్వహించాలన్న పార్టీలే డుమ్మా కొట్టాయి
- మోదీని నిలదీస్తున్నదెవరో, ఆయన కాళ్లు పట్టుకున్నదెవరో ప్రజలు గమనిస్తున్నారు
సీఎం చంద్రబాబునాయుడుపై నోటికొచ్చినట్టు మాట్లాడిన వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి ప్రజలకు క్షమాపణ చెప్పాలని మంత్రి నారా లోకేశ్ డిమాండ్ చేశారు. ఈరోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ, ఏ -2 నిందితుడు విజయసాయిరెడ్డికి చంద్రబాబు గురించి మాట్లాడే హక్కు లేదని, తమపై ఉన్న కేసుల మాఫీ కోసం ఆయన తాపత్రయపడుతున్నారని విమర్శించారు. ప్రధాని మోదీని నిలదీస్తున్నదెవరో, ఆయన కాళ్లు పట్టుకున్నదెవరో ప్రజలు గమనిస్తున్నారని, ప్రధాని పక్కన ఏ2 నిందితుడు తిరగడం మంచిది కాదని అన్నారు. అఖిలపక్ష సమావేశం నిర్వహించాలన్న పార్టీలే ఈ సమావేశానికి హాజరుకాకుండా డుమ్మా కొట్టాయని విమర్శించారు.
కాగా, మరో మంత్రి జవహర్ మాట్లాడుతూ, మోదీ కాళ్లకు మొక్కిన విజయసాయిరెడ్డి, తెలుగు ప్రజల ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టారని, బీజేపీ, వైసీపీ కుట్రలు బయటపడుతున్నాయని అన్నారు. ‘వైసీపీకి సహకరిస్తామని మోదీ చెప్పినట్టుంది! కేంద్ర మంత్రి పదవి కావాలని విజయసాయిరెడ్డి అడుగుతారేమో!’ అంటూ జవహర్ అనుమానం వ్యక్తం చేశారు.