Telangana: ఈ వేసవిలో హైదారాబాద్ కు తాగునీటి కష్టాలుండవు : మంత్రి కేటీఆర్
- నగర వేసవి తాగునీటి ప్రణాళికపై ఉన్నత స్ధాయి సమీక్ష
- నగరానికి సరిపడా తాగు నీరుంది
- గత ఏడాది కన్నా నీటి సరఫరా సామర్ధ్యం పెరిగింది
ఈ వేసవిలో హైదరాబాద్ నగరంలో ఎలాంటి తాగునీటి కష్టాలుండవని, ఇందు కోసం తగిన చర్యలు చేపడుతున్నట్లు మంత్రి కేటీఆర్ తెలిపారు. తెలంగాణ అసెంబ్లీ హాలులో ఈరోజు జరిగిన సమీక్ష సమావేశంలో ఆయన పాల్గొన్నారు. రాజధానిలో తాగునీటి సరఫరా, వేసవికాల ప్రణాళికపై ఉన్నత స్థాయి సమీక్ష సమావేశం నిర్వహించారు. మేయర్ బొంతు రామ్మోహన్ తో కలసి జలమండలి, జీహెచ్ఎంసీ అధికారులతో సమీక్షించారు.
గతంలో కన్నా ప్రస్తుతం నగరంలో తాగునీటి కష్టాలు తగ్గాయని, ఈ సంవత్సరం మరింత మెరుగైన నీటి సరఫరా చేయడానికి చర్యలు తీసుకుంటున్నట్లు కేటీఆర్ తెలిపారు. ప్రస్తుతం కృష్ణా, గోదావరి ప్రాజెక్టుల నుంచి నగరానికి సరిపడా నీటి సరఫరా జరుగుతోందని, గత ఏడాదితో పోల్చితే 100 ఎంఎల్డీల నీటి సరఫరా సామర్థ్యాన్ని జలమండలి చేకూర్చుకుందని చెప్పారు.
ఇంటర్ గ్రిడ్ కనెక్టివిటీ కోసం మాస్టర్ ప్లాన్ తయారు చేయండి
ఈ నీటి వనరులన్నింటి నుంచి నగరంలో ఎక్కడికైనా నీటి సరఫరా చేసేందుకు అవసరమైన ఇంటర్ గ్రిడ్ కనెక్టివిటీ కోసం ఒక మాస్టర్ ప్లాన్ తయారు చేయాలని కేటీఆర్ ఆదేశించారు. ఈ మాస్టర్ ప్లాన్ లో నగర నీటి సరఫరా కోసం ఉద్దేశించిన రెండు రిజర్వాయర్లను సైతం పరిగణనలోకి తీసుకోవాలని, మెత్తం నగరానికి అన్ని నీటి వనరుల నుంచి సుమారు 600 ఎంఎల్డీల నీటి సరఫరాకు అవకాశం ఉందని తెలిపారు.
సుమారు 120 బస్తీలను వాటర్ ట్యాంకర్ ఫ్రీ నీటి సరఫరా చేసేందుకు రూ.15 కోట్లతో నీటి సరఫరా వ్యవస్థకు సంబంధించిన పనులను చేపట్టామని, తద్వారా సుమారు 30 వేల కుటుంబాలకు ఈ వేసవి నీటి సరఫరా కష్టాలు లేకుండా చూస్తున్నట్టు చెప్పారు. శివారు మున్సిపాలిటీల్లో చేపట్టిన తాగునీటి ప్రాజెక్టుల పనులను కేటీఆర్ సమీక్షించారు. ప్రాజక్టులో భాగంగా చేపడుతున్న రోడ్డు తవ్వకాలపైన ప్రజల నుంచి పలు ఫిర్యాదులు వస్తున్న నేపథ్యంలో వెంటనే రోడ్డు రిస్టోరేషన్ పనులు పూర్తి చేయాలని ఆదేశించారు.
సాధ్యమైనన్ని ఇంకుడు గుంతలు నిర్మిస్తాం
ఈ వేసవి కాలంలో నగరంలో సాధ్యమైనన్ని ఇంకుడు గుంతల నిర్మాణాలు చేపట్టనున్నట్లు తెలిపారు. ముందుగా ప్రగతి భవన్ నుంచి మెుదలుకొని అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో ఇంకుడుగుంతల నిర్మాణం జరిగేలా చూస్తామని, ఈ మేరకు ఆదేశాలివ్వమని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి చెబుతామన్నారు. ‘జలం జీవం’ కార్యక్రమంలో భాగంగా చేపడుతున్న రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ థీమ్ పార్కు జూన్ మొదటి వారం నాటికి సిద్ధమవుతుందని చెప్పారు.