pan: పాన్‌కార్డుకు ఆధార్ కార్డుల అనుసంధానానికి గడువు పొడిగింపు
- ఇప్పటికే పలుసార్లు గడువు పొడిగింపు
- ఈ నెల 31తో ముగియనున్న గడువు నేపథ్యంలో మరోసారి గడువు పొడిగింపు ప్రకటన
- ఈ ఏడాది జూన్ 30 వరకు పొడిగించిన సీబీడీటీ
పాన్‌కార్డుకు ఆధార్ అనుసంధానం చేసుకోలేకపోయిన వారికి సీబీడీటీ శుభవార్త చెప్పింది. ఈ ప్రక్రియ పూర్తి చేసుకునేందుకు గడువును ఈ ఏడాది జూన్ 30 వరకు పొడిగించినట్లు తెలిపింది. పాన్‌కార్డుకు ఆధార్ అనుసంధానం గడువును ఇప్పటికే పలుసార్లు పొడిగించిన విషయం తెలిసిందే. ఈ నెల 31వరకు ఈ ప్రక్రియ పూర్తి చేసుకునేందుకు గడువు ఉండగా, మరోసారి ఆ గడువును పెంచారు.
తమ పాన్ కార్డు లేక ఆధార్ కార్డుల్లో తప్పులు ఉండడం వంటి పలు కారణాల వల్ల ఇప్పటికీ కొందరు పాన్‌కార్డుకు ఆధార్ అనుసంధానం చేసుకోలేకపోయారు. ప్రభుత్వం అన్నింటికీ ఆధార్ కార్డు తప్పనిసరి చేస్తుండడంతో గోప్యత హక్కులకు విఘాతం కలుగుతోందని ఆరోపిస్తూ గతంలో పిటిషన్లు దాఖలైన సంగతి, వీటిపై విచారించిన ఐదుగురు సభ్యులతో కూడిన సుప్రీం రాజ్యాంగ ధర్మాసనం గత ఏడాది డిసెంబర్ 15న.. పాన్ కార్డుకి ఆధార్ అనుసంధానం గడువును ఈ ఏడాది మార్చి 31వరకు పొడిగించిన విషయం తెలిసిందే.