Telugudesam: ఈ సంఘటనతో విజయసాయిరెడ్డి నిజస్వరూపం బయటపడింది: ఎంపీ కొనకళ్ల నారాయణ
- ఏపీ కోసం పోరాడుతున్నామంటూనే పాదాభివందనం చేస్తున్నారు!
- వైసీపీ చేస్తున్న పోరాటంలో చిత్తశుద్ధి లేదు
- బీజేపీ ప్రభుత్వానికి నిజాయతీ, దమ్ము ఉంటే చర్చ జరపాలి
ప్రధాని మోదీకి వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి పాదాభివందనం చేయడంపై ఇప్పటికే పలు విమర్శలు తలెత్తాయి. ఈ విషయమై టీడీపీ ఎంపీ కొనకళ్ల నారాయణ స్పందిస్తూ, ఈ సంఘటన ద్వారా విజయసాయిరెడ్డి నిజస్వరూపం తెలిసిపోయిందని, రాష్ట్రం కోసం పోరాడుతున్నామంటూనే పాదాభివందనం చేస్తున్నారని మండిపడ్డారు. ఏపీకి న్యాయం చేయాలంటూ వైసీపీ చేస్తున్న పోరాటంలో చిత్తశుద్ధి లేదని తేలిపోయిందని విమర్శించారు.
రాష్ట్ర ప్రయోజనాల కోసం వైసీపీ తమ ఎంపీలతో రాజీనామా చేయిస్తామని అంటోందని, ఒకవేళ వాళ్లు రాజీనామాలు చేస్తే వాటిని ఏడాది వరకు స్పీకర్ ఆమోదించకుండా ఉండేలా ఒప్పందం కుదుర్చుకుంటారని ఆరోపించారు. కేంద్ర ప్రభుత్వంపై తాము పెట్టిన అవిశ్వాస తీర్మానంపై చర్చ జరపకుండా బీజేపీ సర్కార్ కుంటిసాకులు చెబుతోందని, ఏపీకి జరిగిన అన్యాయం గురించి దేశ వ్యాప్తంగా తెలుస్తుందనే భయంతోనే ఈ చర్చను జరగనీయడం లేదని విమర్శించారు. బీజేపీ ప్రభుత్వానికి నిజాయతీ, దమ్ము కనుక ఉంటే అవిశ్వాస తీర్మానంపై చర్చ జరపాలని కొనకళ్ల సవాల్ విసిరారు.