IPL 2018: ఐపీఎల్ ప్రారంభోత్సవంలో అదరగొట్టే సినీ తారలు వీరే!

  • ఐపీఎల్ ప్రారంభోత్సవంలో రణ్‌వీర్, వరుణ్ థావన్, జాక్వెలిన్ ఫెర్నాండెజ్, తమన్నా ఆటాపాటా
  • ఏప్రిల్ 7 నుంచి ఐపీఎల్ సమరం షురూ
  • ముంబై-చెన్నై జట్ల మధ్య వాంఖడే స్టేడియంలో తొలి మ్యాచ్

ఏప్రిల్ 7 నుంచి ధనాధన్ ఐపీఎల్ టీ-20 టోర్నీ ప్రారంభంకానుంది. అదే రోజు ప్రారంభోత్సవం కూడా అట్టహాసంగా జరగనుంది. మామూలుగా మ్యాచ్‌లు ప్రారంభం కావడానికి ఒక్కరోజు ముందుగా ఈ వినోద కార్యక్రమాన్ని నిర్వహించడం ఆనవాయతీగా వస్తోంది. కానీ, కొన్ని టెక్నికల్ కారణాల వల్ల ఈసారి తొలి మ్యాచ్‌ ప్రారంభం రోజే ఈ ఉత్సవం కూడా జరగనుంది. గత సీజన్ల మాదిరిగానే ఈ పదకొండో సీజన్‌ని కూడా బాలీవుడ్ అందాల తారల డాన్సులతో క్రికెట్ అభిమానులకు కనువిందు చేయాలని ఐపీఎల్ నిర్వాహకులు భావిస్తున్నారు. ఈ కార్యక్రమాన్ని అదరహో అనేలా నిర్వహించేందుకు వారు ఏర్పాట్లు చేసుకుంటున్నారు.

ఈ సారి బాలీవుడ్ స్టార్లు రణ్‌వీర్ సింగ్, వరుణ్ ధావన్, జాక్వెలిన్ ఫెర్నాండెజ్, తమన్నాతో పాటు పలువురు వేదికపై డాన్సు చేయనున్నారని బీసీసీఐ అధికారి ఒకరు తెలిపారు. అలాగే ప్రముఖ గాయకుడు మికా సింగ్, ప్రముఖ కొరియోగ్రాఫర్ ప్రభుదేవా కూడా తమ ప్రదర్శనలతో ఆకట్టుకోనున్నారు. కాగా, ఈ కార్యక్రమంలో పావు గంట ప్రదర్శన ఇచ్చేందుకు రణ్‌వీర్ సింగ్ రూ.5 కోట్లు డిమాండ్ చేసినట్లు వస్తున్న వార్తల్లో నిజంలేదని సదరు అధికారి స్పష్టం చేశారు. వేడుక అనంతరం డిఫెండింగ్ ఛాంపియన్ ముంబై ఇండియన్స్-చెన్నై సూపర్ కింగ్స్ జట్ల మధ్య ముంబైలోని వాంఖడే స్టేడియంలో తొలి మ్యాచ్ జరుగుతుంది. మే 27న జరిగే ఫైనల్ మ్యాచ్‌కి ఇదే స్టేడియం వేదిక కానున్న సంగతి తెలిసిందే.

IPL 2018
Ranveer Singh
Tamannaah
Varun Dhawan
Bollywood
  • Loading...

More Telugu News