BJP: ఎన్నికల సంఘానికంటే ముందే కర్ణాటక ఎన్నికల షెడ్యూల్ ప్రకటించిన బీజేపీ నేత!

  • కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ ను ప్రకటించిన ఎన్నికల సంఘం
  • ఎన్నికల సంఘం కంటే ముందే షెడ్యూల్ ప్రకటించిన బీజేపీ నేత
  • సోషల్ మీడియాలో దుమారం రేగడంతో ట్వీట్ తొలగింపు 

జాతీయ ఎన్నికల కమీషన్ కంటే ముందుగా కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ ను బీజేపీ అగ్రనేత, ఆ పార్టీ ఐటీ సెల్ చీఫ్ అమిత్ మాలవీయ ట్విట్టర్ లో వెల్లడించారు. దీంతో ఆయనపై తీవ్ర స్థాయిలో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. దాని వివరాల్లోకి వెళ్తే... కర్ణాటక అసెంబ్లీ షెడ్యూల్ ను జాతీయ ఎన్నికల సంఘం ప్రకటించేందుకు కొన్ని నిమిషాల ముందు ‘‘మే 12న కర్ణాటక ఎన్నికలు జరగనున్నాయి. 18వ తేదీన ఓట్లలెక్కింపు జరుగుతుంది.’’ అంటూ బీజేపీ ఐటీసెల్ చీఫ్ అమిత్ మాలవీయ ట్వీట్ చేశారు.

దీంతో నెటిజన్లు ఆయనపై విమర్శల వర్షం కురిపించారు. ఎన్నికల సంఘం ప్రకటించక ముందే మీకు తేదీలు ఎలా తెలిశాయి?’’ అని ఒకరు ప్రశ్నించగా, మరొకరు ‘‘ఇంకా ఎన్ని విషయాలు మీకు తెలుసు? ఎలక్ట్రోరల్ డేటా కూడా తెచ్చేసుకున్నారా?’’ అంటూ నిలదీశారు. ‘‘ఎన్నికల సంఘం పప్పెట్‌ లాగా మారిపోయింది. ఎన్నికల షెడ్యూల్‌ ను బీజేపీ ప్రకటిస్తే, ఎన్నికల ఫలితాలను కేంబ్రిడ్జ్ ఎనలిటికా ఫైనలైజ్ చేస్తుంది’’ అంటూ మరో నెటిజన్ వ్యంగ్యాస్త్రాన్ని సంధించాడు.

దీంతో ఆ పోస్టును మాలవీయ తొలగించి, ఆ వార్తలన్నీ అవాస్తవాలేనని దబాయిస్తూ మరో పోస్టు పెట్టగా, అప్పటికే దానిని స్క్రీన్ షాట్ తీసిన నెటిజన్లు, దానిని పోస్టు చేస్తూ ఆయనను నిలదీస్తున్నారు. కాగా, ఎన్నికల సంఘం ప్రకటించిన షెడ్యూల్‌, ఆయన పేర్కొన్న తేదీలు ఇంచుమించు సరిపోలడంతో జాతీయ ఎన్నికల కమీషన్ నిబద్ధతపై సందేహాలు వ్యక్తమవుతున్నాయి. 

  • Loading...

More Telugu News