Pregnancy: షాకింగ్.... ఏడు నెలల గర్భవతి చేత డాన్స్ చేయించిన లెక్చరర్లు...!

  • కాలేజీలో చేరేటప్పుడే గర్భం దాల్చమంటూ అఫిడవిట్ ఇవ్వాలి 
  • డాన్సు చేయకపోతే మార్కులు తగ్గిస్తామని లెక్చరర్ల బెదిరింపు
  • గత్యంతరం లేక చేస్తే చూసి నవ్విన వైనం

ఛత్తీస్‌గఢ్‌లోని ఓ ప్రైవేటు బీఈడీ కాలేజీలో దిగ్ర్భాంతికరమైన సంఘటన చోటుచేసుకుంది. ఓ ఏడు నెలల గర్భిణి చేత లెక్చరర్లు డాన్సు చేయించిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. వివరాల్లోకెళితే...సంత్ హర్కేవాల్ బీఈడీ కాలేజీలో చేరే మహిళా విద్యార్థులు కోర్సు చేస్తున్న సమయంలో గర్భం దాల్చమంటూ ముందే అఫిడవిట్‌ను సమర్పించాలి. ఈ నిబంధనకు ఒప్పుకుంటూ అంబికాపూర్‌కి చెందిన బాధితురాలు ప్రతిభ మింజ్ (24) ఆగస్టు, 2017లో కాలేజీలో చేరింది.

అయితే అప్పటికే ఆమె మూడు నెలల గర్భవతి కావడం గమనార్హం. ఫిబ్రవరి 3న ఆమె పండంటి అమ్మాయికి జన్మనిచ్చింది. ఈ నేపథ్యంలో నిబంధనలు ఉల్లంఘించిందంటూ ఏప్రిల్‌లో జరిగే పరీక్షకు హాజరు కానివ్వమని ఆమెకు కాలేజీ యాజమాన్యం తేల్చిచెప్పేసింది. తాను వద్దని పదే పదే బతిమలాడినా వినకుండా డిసెంబరు నెలలో లెక్చరర్లు తన చేత నృత్యాలు చేయించారని ప్రతిభ ఆరోపించింది. అప్పటికి తాను ఏడు నెలల గర్భవతినని ఆమె చెప్పింది.

డాన్సు చేయకుంటే మార్కులు తగ్గిస్తామంటూ వారు తనను బెదిరించారని ఆమె వాపోయింది. గత్యంతరం లేక డాన్సు చేస్తే అది చూసి వారు నవ్వారని, అవమానాన్ని తట్టుకోలేక తాను, తన క్లాస్‌మేట్లు అక్కడి నుంచి వెళ్లిపోయామని ప్రతిభ తెలిపింది. కాగా, ఈ నెల 17, 20 తేదీల్లో కాలేజీ ప్రిన్సిపాల్‌ అంజన్ సింగ్‌ని కలిసి పరీక్షల వరకు తనకు లీవు ఇవ్వాలని విజ్ఞప్తి చేశానని ఆమె తెలిపింది. అయితే అందుకు ఆయన ఒప్పుకోకపోవడంతో సాయం కోసం నేషనల్ స్టూడెంట్స్ యూనియన్ ఆఫ్ ఇండియా (ఎన్ఎస్‌యూఐ)ని కలిశానని ఆమె తెలిపింది.

ఇదే విషయమై ఉన్నత విద్యాశాఖ నోడల్ అధికారి ఇరిపతి సంబంధిత కాలేజీ ప్రిన్సిపాల్‌ని వివరణ కోరారు. కోర్సు సమయంలో గర్భం దాల్చమంటూ మహిళా విద్యార్థుల చేత అఫిడవిట్‌పై సంతకం చేయించుకునే నిబంధనను రద్దు చేయాలంటూ ఆదేశించానని ఆయన చెప్పారు. అయితే గర్భిణి చేత డాన్సులు చేయించిన సంగతి తనకు తెలియదని, దీని గురించి తెలుసుకుని తగు చర్యలు తీసుకుంటానని ప్రిన్సిపాల్ హామీ ఇవ్వడం గమనార్హం.

Pregnancy
Sant Harkewal B Ed College
Chhattisgarh
Dance
  • Loading...

More Telugu News