India: భారత్‌కు మారోమారు వార్నింగ్ ఇచ్చిన చైనా.. డోక్లాం నుంచి పాఠాలు నేర్చుకోవాలని హితవు
- డోక్లాం స్టాండాఫ్‌కు చైనానే కారణమన్న భారత్
- భారత్ వ్యాఖ్యలను తీవ్రంగా పరిగణించిన చైనా
- డోక్లాం తమదేనని మరోమారు స్పష్టం చేసిన చైనా
పొరుగుదేశం చైనా మరోమారు భారత్‌కు హెచ్చరికలు జారీ చేసింది. డోక్లాం నుంచి భారత్ ఇప్పటికీ పాఠాలు నేర్చుకోలేదని ఎద్దేవా చేసింది. డోక్లాం ఎప్పటికీ తమదేనని, గతేడాది ఇక్కడ జరిగిన స్టాండాఫ్ నుంచి భారత్ పాఠాలు నేర్చుకుంటే మంచిదని హితవు పలికింది. వివాదాస్పద ప్రాంతంలో చైనా ‘స్టేటస్ కో’ (యథాతథ స్థితి)ను ఉల్లంఘించడం వల్లే ‘ఫేస్-ఆఫ్’ అనివార్యమైందన్న భారత దౌత్యవేత్త వ్యాఖ్యలకు స్పందిస్తూ చైనా ఈ వ్యాఖ్యలు చేసింది.
చైనాలో భారత రాయబారి అయిన గౌతమ్ బంబావాలే చేసిన ‘ఫేస్-ఆఫ్’ వ్యాఖ్యలపై చైనా విదేశాంగశాఖ అధికార ప్రతినిధి హువా చున్యింగ్ మాట్లాడుతూ డోక్లాం తమదేనని, దానికి చారిత్రక నేపథ్యం ఉందని స్పష్టం చేశారు. చైనా కార్యకలాపాలు తమ సార్వభౌమాధికారిక హక్కులకు లోబడే ఉన్నాయని పేర్కొన్నారు. స్టేటస్ కోను మార్చే ఉద్దేశం తమకు లేదని తేల్చి చెప్పారు.
గతేడాది ఆగస్టులో డోక్లాంలో రోడ్డు నిర్మించేందుకు డ్రాగన్ కంట్రీ ఆర్మీ ప్రయత్నించగా భారత ఆర్మీ అడ్డుకుంది. దీంతో ఇరు దేశాల మధ్య తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. మొత్తంగా 73 రోజులపాటు స్టాండాఫ్ కొనసాగింది. ఒకానొక దశలో ఇరు దేశాల మధ్య యుద్ధం తప్పదన్న వార్తలు కూడా వెలువడ్డాయి. అయితే రెండు దేశాలు పరస్పర అంగీకారంతో డోక్లాం నుంచి తమ సేనలను వెనక్కి పిలిపించడంతో ఉద్రిక్తత సమసింది.