Jana Sena: సీబీఐ మాజీ జేడీ లక్ష్మీ నారాయణ వస్తే ఆహ్వానిస్తాం: పవన్ కల్యాణ్

  • లక్ష్మీనారాయణకు రాజకీయ, పరిపాలన విధానాలపై మంచి పట్టుంది
  • జనసేన ఆవిర్భావ సభకు ముందు లక్ష్మీనారాయణ 'ఆల్ ది బెస్ట్' మెసేజ్ పెట్టారు
  • హోదాపై అనంతపురం నుంచి పోరాటం ప్రారంభమవుతుంది

సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ పార్టీలోకి వస్తానంటే ఆహ్వానిస్తామని జనసేన అధినేత పవన్‌ కల్యాణ్ అన్నారు. హైదరాబాదులో సీపీఎం, సీపీఐ పార్టీ ముఖ్యనేతలతో కలిసి నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, లక్ష్మీనారాయణకు రాజకీయ, పరిపాలన విధానాలపై మంచి పట్టు ఉందని అన్నారు. ఆయనను తాను ఒకే ఒక్కసారి కలిశానని చెప్పారు. పార్టీలో చేరడంపై ఆయనతో ఎలాంటి చర్చలు జరపలేదని ఆయన స్పష్టం చేశారు. గుంటూరులో నిర్వహించిన జనసేన ఆవిర్భావ సభకు ముందు ఆయన తనకు 'ఆల్ ది బెస్ట్' మెసేజ్ పెట్టారని పవన్ వెల్లడించారు.

 కేంద్రం నుంచి రావాల్సిన నిధుల గురించి 2016 నుంచే అడగడం ప్రారంభించానని ఆయన గుర్తు చేశారు. తాము డిమాండ్ చేసినప్పుడు ప్యాకేజీ సరిపోతుందని, ప్రత్యేక హోదా అవసరం లేదన్నట్టుగా టీడీపీ మాట్లాడిందని ఆయన తెలిపారు. దీనిపై తమ పోరాటం అనంతపురం నుంచి ప్రారంభమవుతుందని ఆయన ప్రకటించారు. హోదా కోసం వైఎస్సార్సీపీ నామ్‌ కే వాస్తే ఆందోళన చేసిందని ఆయన ఆరోపించారు. ఏపీకి ప్రత్యేక హోదా సాధనలో టీడీపీ విఫలమైందని ఆయన చెప్పారు. కేంద్రంతో టీడీపీ ప్రతిసారీ రాజీ ధోరణితోనే ప్రవర్తించిందని ఆయన విమర్శించారు. ప్రత్యేకహోదాపై ఇంత కాలం ఏం చేయలేని టీడీపీ ఇక మీదట కూడా ఏమీ చేయలేదని పవన్ కల్యాణ్ అన్నారు.

  • Loading...

More Telugu News