YSRCP: రేపు వాయిదా వేస్తే రేపే ఎంపీల రాజీనామాలు: జగన్ సంచలన నిర్ణయం
- అవిశ్వాసంపై చర్చించాల్సిందే
- చర్చించకుండా వాయిదా వేస్తే అదే రోజు రాజీనామాలు
- స్పీకర్ ఫార్మాట్ లోనే ఉంటాయన్న జగన్
ప్రత్యేక హోదా ఇవ్వకుంటే తన పార్టీ ఎంపీలు వచ్చే నెల 6వ తేదీన రాజీనామా చేస్తారని, అంతకన్నా ముందుగానే తామిచ్చిన అవిశ్వాస నోటీసులపై చర్చించకుండా పార్లమెంట్ ను వాయిదా వేయాలని నరేంద్ర మోదీ ప్రభుత్వం చూస్తే, వాయిదా వేసిన రోజునే ఎంపీలంతా రాజీనామా చేస్తారని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ సంచలన ప్రకటన చేశారు. పార్లమెంట్ ను రేపు నిరవధికంగా వాయిదా వేస్తున్నట్టు ప్రకటిస్తే, రేపే ఎంపీలంతా రిజైన్ చేస్తారని ఆయన స్పష్టం చేశారు. స్పీకర్ ఫార్మాట్ లోనే తమ ఎంపీల రాజీనామా పత్రాలు ఉంటాయని అన్నారు. కాగా, టీడీపీ ఎంపీలు తమతో కలసి రావాలని, రాష్ట్ర ప్రయోజనాల పట్ల చిత్తశుద్ధి ఉంటే రాజీనామాలకు సిద్ధంగా ఉండాలని వైసీపీ ఎంపీ మేకపాటి రాజమోహన్ రెడ్డి వ్యాఖ్యానించారు.