Telangana: వాటర్ బాటిలే ప్రాణం తీసింది.. నిజామాబాద్ ఆటో ప్రమాదానికి కారణం అదే!

  • రోడ్డుపై గుంతను తప్పించే ప్రయత్నంలో ప్రమాదం
  • డ్రైవర్ కాళ్ల కిందకు వచ్చిన వాటర్ బాటిల్
  • అదుపు తప్పి బావిలోకి దూసుకెళ్లిన ఆటో

నిజామాబాద్ జిల్లా మెండోర శివారులో ఆదివారం మధ్యాహ్నం జరిగిన ఘోర ప్రమాదంలో మరణించిన వారి సంఖ్య 11 మందికి చేరింది. పరిమితికి మించి ప్రయాణికులను ఎక్కించుకున్న ఆటో అదుపుతప్పి రోడ్డు పక్కనే ఉన్న వ్యవసాయ బావిలో పడడంతో 11 మంది ప్రాణాలు కోల్పోయారు. వీరిలో ఆరుగురు పెద్దలు, ఐదుగురు చిన్నారులు ఉన్నారు. కొందరు బావిలోని మోటారు పైపులను పట్టుకుని ప్రాణాలను కాపాడుకున్నారు. ప్రమాద సమయంలో డ్రైవర్‌తో కలిపి ఆటోలో 20 మంది ఉన్నారు. ప్రమాదం నుంచి డ్రైవర్ సహా 9 మంది బయటపడ్డారు.

ఆటో ప్రమాదానికి డ్రైవర్‌కు అనుభవ లేమితోపాటు వాటర్ బాటిలే కారణమని ప్రాథమికంగా తేల్చారు. ఆటో  మితిమీరిన వేగంతో వెళ్తుండగా రోడ్డుపైనున్న  గుంతను తప్పించేందుకు డ్రైవర్ ప్రయత్నించాడు. అదే సమయంలో వాటర్ బాటిల్ దొర్లుకుంటూ కాలు కిందికి రావడంతో బ్రేక్ వేయడం సాధ్యం కాలేదు. దీంతో అదుపు తప్పిన ఆటో పక్కనే ఉన్న బావిలోకి దూసుకెళ్లింది. ఆటో డ్రైవర్ గోపి శ్రీనివాస్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ప్రమాదం జరిగిన వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది బావిలోని నీటిని తోడి, ఆటోను, మృతదేహాలను వెలికి తీశారు.

ఈ ఘోర దుర్ఘటనపై ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రులు విచారం వ్యక్తం చేశారు. ప్రమాదం తనను తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసినట్టు కేసీఆర్ పేర్కొన్నారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని మంత్రులను ఆదేశించారు.

  • Loading...

More Telugu News