Chandrababu: ఈశాన్య రాష్ట్రాలకు ఇచ్చేవన్నీ ఏపీకి ఇవ్వడం బీజేపీకి ఇష్టం లేదు : సీఎం చంద్రబాబు
- రాజకీయ పరిణామాలపై చంద్రబాబు టెలీ కాన్ఫరెన్స్
- అమిత్ షా లేఖకు ఏపీ అసెంబ్లీలోనే సమాధానమిచ్చాం
- బీజేపీతో పొత్తు పెట్టుకుందే రాష్ట్ర ప్రయోజనాల కోసం
రాజకీయ పరిణామాలపై సీఎం చంద్రబాబు టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు. టెలీ కాన్ఫరెన్స్ లో టీడీపీ ఎంపీలు, మంత్రులు, పార్టీ ప్రచార సారథులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ, బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా లేఖకు ఏపీ అసెంబ్లీలోనే సమాధానమిచ్చామని, బీజేపీతో పొత్తు పెట్టుకున్నదే రాష్ట్ర ప్రయోజనాల కోసమని అన్నారు. ప్రజల మనోభావాలకు అనుగుణంగా తాము అడగడం బీజేపీకి నచ్చడం లేదని, ప్రత్యేక హోదాకు సమానంగా ప్రత్యేక ఆర్థిక ప్యాకేజ్ ఇస్తామంటేనే నాడు అంగీకరించామని, ‘హోదా’ ఏ రాష్ట్రానికీ ఇవ్వొద్దని ఆర్థిక సంఘం చెప్పిందని వక్రీకరించారని చంద్రబాబు మండిపడ్డారు.
ఈఏపీలకు నిధులు ఇస్తామని చెప్పిన కేంద్ర ప్రభుత్వం, కనీసం, మెమో కూడా ఇవ్వలేదని, నాలుగేళ్లయ్యాక ఇప్పుడు స్పెషల్ పర్పస్ వెహికల్ అంటున్నారంటూ చంద్రబాబు ధ్వజమెత్తారు. ఏ రాష్ట్రానికీ ‘హోదా’ ఇవ్వడం లేదని చెప్పిన కేంద్ర ప్రభుత్వం, ఈశాన్య రాష్ట్రాలకు 90 :10 నిధులు కొనసాగిస్తున్నారని, జీఎస్టీలో కూడా ఈశాన్య రాష్ట్రాలకు ప్రత్యేక లబ్ధి చేకూరుస్తున్నారన్న విషయాన్ని ప్రస్తావించారు. ఈశాన్య రాష్ట్రాలకు ఇచ్చేవన్నీ ఏపీకి కూడా ఇవ్వడం బీజేపీకి ఇష్టం లేదని, తొలి బడ్జెట్ లోనే రెక్కలు విరిచి ఎగరమంటే ఎలా అని కేంద్రాన్ని ప్రశ్నించామని చంద్రబాబు అన్నారు.