kJ Yesudas: నేను బొద్దింకనైనా అయ్యుంటే బాగుండేది.. దైవ దర్శనం కలిగేది!: ప్రముఖ గాయకుడు ఏసుదాస్ ఆవేదన

  • గురువాయూర్ మందిరంలోకి అనుమతి నిరాకరణ
  • పలుమార్లు ఆలయం బయటే భక్తిపాటలు
  • కీటకమై ఉంటే ఎంచక్కా స్వామిని దర్శించుకుని ఉండేవాడినన్న గాయకుడు

తాను కనీసం బొద్దింకనైనా అయ్యుంటే ఎంతో బాగుండేదని ప్రముఖ గాయకుడు కేజే ఏసుదాస్ ఆవేదన వ్యక్తం చేశారు. పురుగులకున్న అదృష్టం కూడా తనకు లేకుండా పోయిందన్నారు. ఎర్నాకులంలోని త్రిపునితురలో తన తండ్రి అగస్టీన్ జోసెఫ్ పేరిట ఏర్పాటు చేసిన సంస్థ తరపున అవార్డులు బహూకరణ కార్యక్రమంలో ఏసుదాస్ మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు.

 శ్రీకృష్ణుడంటే ఎంతో ఇష్టపడే ఆయనకు ఇప్పటి వరకు గురువాయూర్‌‌లో కొలువైన తన ఇష్ట దైవాన్ని దర్శించుకోలేకపోయారు. అన్యమతస్థులకు ఇక్కడ ప్రవేశం లేకపోవడమే అందుకు కారణం. ఆలయంలోకి వెళ్లాలని పలుమార్లు ప్రయత్నించిన ఏసుదాస్ విఫలమయ్యారు. దీంతో దేవాలయం బయటే నిలబడి పలుమార్లు శ్రీకృష్ణుడిపై భక్తిపాటలు పాడారు.

తాజాగా ఏసుదాస్ మాట్లాడుతూ తాను బొద్దింకను కానీ, మరే క్రిమికీటకాన్నో అయి ఉంటే ఈపాటికే గురువాయూర్‌ మందిరంలోకి ప్రవేశించి స్వామి వారిని దర్శించుకుని ఉండేవాడినన్నారు. ఆ పాటి అదృష్టం కూడా తనకు లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు.

నిజానికి ఏసుదాస్ రోమన్ కేథలిక్ కుటుంబంలో పుట్టినప్పటికీ హైందవ సంప్రదాయాలనే అనుసరిస్తారు. గతేడాది తిరువనంతపురంలోని పద్మనాభ స్వామి ఆలయంలో ప్రార్థనకు అనుమతి కోరడంతో ఆలయ కమిటీ అనుమతులు మంజూరు చేసింది. విజయదశమి సందర్భంగా ఆలయ ప్రవేశానికి అనుమతి ఇచ్చినప్పటికీ ఆయన వెళ్లలేదు. ఈ విషయంలో తాను తొందర పడదల్చుకోలేదని, దేవుడు పిలిచినప్పుడే వెళ్తానని చెప్పుకొచ్చారు. ఈ ఏడాది ఏసుదాసుకు మలప్పురంలోని కదంపుళా దేవి దర్శనానికి అనుమతి లభించలేదు. 

kJ Yesudas
Singer
guruvayur
Lord Sri krishna
  • Loading...

More Telugu News