Chandrababu: చంద్రబాబునాయుడు గారూ! ఇలాంటి వాళ్ల వల్ల మీకు చాలా చెడ్డపేరు వస్తోంది : తమ్మారెడ్డి భరద్వాజ
- చలసాని శ్రీనివాస్ పై ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధి వ్యాఖ్యలు దారుణం
- ఇటువంటి వాళ్లు దిగజారుడు మాటలు మాట్లాడుతున్నారు
- వాళ్ల మాటలను అరికట్టండి
- ‘నా ఆలోచన’ లో తమ్మారెడ్డి
ఏపీకి ప్రత్యేక హోదా సాధన కోసం చేస్తున్న పోరాటం వేగవంతమవుతున్న దశలో టీడీపీ ఎమ్మెల్సీ బాబూ రాజేంద్రప్రసాద్ చేసిన వ్యాఖ్యలు మరచిపోకముందే, ఏపీ ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధి (ఎన్ఆర్ఐ) చేసిన వ్యాఖ్యలు చాలా దారుణమని ప్రముఖ దర్శక - నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ మండిపడ్డారు.
‘నా ఆలోచన’లో తమ్మారెడ్డి మాట్లాడుతూ, ‘ప్రత్యేక హోదా కోసం నాలుగేళ్ల నుంచి పోరాడుతున్న చలసాని శ్రీనివాస్ ను సంభోదిస్తూ ఓ పోస్ట్ పెట్టారు. ‘ఏపీకి ప్రత్యేక హోదా వస్తే ఆత్మకూరు లేకపోతే ఘనాత్కూర్... విభజిత ఆంధ్రప్రదేశ్ ను ఒక విఫల రాష్ట్రంగా చిత్రీకరించే ప్రయత్నాలు చేయకు.. జరుగుతున్న అభివృద్ధి నెమ్మదించేలా వెధవ నాటకాలేద్దామంటే జనం నీ మక్కెలు విరగ్గొడతారు..’ అంటూ ఇలాంటి భాషను ఏపీ ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధి వాడాడు. నాలుగేళ్ల నుంచి ఓ వ్యక్తి ఉద్యమం చేస్తుంటే.. అది నాటకమని ఈ వ్యక్తి (ఏపీ ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధి) చెబుతున్నాడు.
చంద్రబాబుగారికి నేను చెప్పేదేమిటంటే.. ఇటువంటి సంఘ విద్రోహ శక్తులు ( ఏపీ ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధి..అతని పేరు చెప్పడానికి నాకు సిగ్గుచేటుగా ఉంది. అందుకే, అతని పేరు చెప్పట్లేదు) దిగజారుడు మాటలు మాట్లాడుతున్నారు. ఏపీకి న్యాయం జరగాలని చేస్తున్న రాస్తారోకోకు సపోర్టు చేస్తున్నట్టు కళా వెంకట్రావు గారు ప్రకటించారు. మరి, ఆయన మక్కెలు కూడా ఏపీ ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధి విరగ్గొడతాడా? ముఖ్యమంత్రి గారు చెప్పారు కాబట్టే కళా వెంకట్రావు గారు మద్దతిచ్చారు.
ముఖ్యమంత్రి గారి మక్కెలు కూడా ఏపీ ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధి విరగ్గొడతాడా?.. ఏపీకి న్యాయం జరగాలని చేస్తున్న ఉద్యమం కోసం అందరినీ కలుపుకు పోవాలి గానీ, నోరుంది కదా అనో, పదవి ఇచ్చారు కదా అనో, చంద్రబాబు దగ్గర పేరు సంపాదించుకుందామనో.. ఇలా తొత్తులుగా, బానిసలుగా బతుకుదామనుకునే వాళ్లందరినీ దగ్గరకు తీయడం వల్ల చంద్రబాబు నాయుడుగారికి చాలా చెడ్డపేరు వస్తుంది.
ఇలాంటి వాళ్లను ( ఏపీ ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధి ) అరికట్టండి. రాష్ట్రానికి కావాల్సింది సాధించేందుకు మీతో పాటు మేమందరం ఉన్నాం. అంతేతప్పా, ఇలా వేధించడం, బూతులు తిట్టడం, బెదిరించడం, ‘బద్మాష్’ అనడం కరెక్టు కాదు. ఇలాంటి మాటలు నా లాంటి వాళ్లు మాట్లాడితే ఫర్వాలేదు. కానీ, ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధులై ఉండి ఇలా మాట్లాడటం తగదు! ప్రభుత్వాన్ని రిప్రజెంట్ చేయడమంటే..చంద్రబాబునాయుడు గారిని రిప్రజెంట్ చేయడమే’ అని తమ్మారెడ్డి మండిపడ్డారు.