Poison: మూడు దశాబ్దాలుగా విషాన్ని పాయసంలా తాగుతున్న కర్నూలు వాసి....!
- చిన్నప్పటి నుంచి పాములు పడుతున్న తలారి చిరంజీవి
- వేడివేడి టీలో పాముల విషం పిండుకుని తాగుతున్న వైనం
- నోటితో విషం తాగితే ప్రమాదం లేదంటోన్న వైద్యులు
- ఇలాంటివి మానేయాలంటూ జనవిజ్ఞానవేదిక హితవు
ఆంధ్రప్రదేశ్‌లోని కర్నూలు జిల్లా, కల్లుకుంట గ్రామానికి చెందిన తలారి చిరంజీవి గత మూడు దశాబ్దాలుగా పాముల విషాన్ని తియ్యని పాయసం తాగినట్లుగా తాగేస్తున్నాడు. మరి అతనికి ఏమీ కాలేదా? అనేగా మీ డౌటు..! అవును. అతనికి ఏం కావడం లేదు. అతని వయసు ఇప్పుడు 42 ఏళ్లు.
వేడి వేడి టీలో పాము విషాన్ని కలుపుకుని తాగే అలవాటు అతనికి ఉంది. ఎలాంటి విష సర్పాన్నైనా సరే అతను సులభంగా పట్టేస్తాడు. పాములతో కాలక్షేపం చేయడమంటే అతనికి ఎంతో సరదా. అతని తాత ముత్తాతలంతా కూడా పాములు పట్టేవారే. చిన్నప్పటి నుంచే పాములు పట్టడం, వాటితో ఆడుకోవడం చిరంజీవికి అలవాటయింది.
అయితే ఇందులో ఏమీ విచిత్రం లేదని వైద్యులు అంటున్నారు. నోటి ద్వారా విషం తాగితే ప్రమాదం లేదని వారు చెబుతున్నారు. మరోవైపు జనవిజ్ఞాన వేదిక సభ్యులు మాత్రం ఇలాంటి అలవాటును మానుకోవాలని చిరంజీవికి సూచిస్తున్నారు. విషం తాగడం అనేది మానసిక బవహీనతకు నిదర్శనమని వారంటున్నారు.
పాముల నుంచి విషం పిండుకున్నాక వాటి కోరలను పీకేసి దగ్గర్లో ఉన్న అడవుల్లో వాటిని విడిచిపెడతానని చిరంజీవి చెబుతున్నాడు. ఏడాదిలో కనీసం 30-40 సార్లయినా విషం తాగాల్సిందేనని అతను చెబుతున్నాడు. పాములు పట్టేటప్పుడు తాను ఎన్నోసార్లు కాట్లకు గురయ్యానని, అయితే తనకేమీ కాలేదని అతను చెబుతుండటం అందర్నీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది.