Psychological problems: పోలీసులపై కోపాన్ని అలా తీర్చుకున్నాడు...చివరికి అరెస్టయ్యాడు...!
- తనను కొట్టినందుకు పోలీసులపై కక్ష పెంచుకున్న సెక్యూరిటీ గార్డు
- చిర్రెత్తినప్పుడల్లా పోలీసు కంట్రోల్ రూమ్‌కి ఫోన్లు
- మహిళా పోలీసులతో దుర్భాష..ఎట్టకేలకు అరెస్టు
ఓ భూ తగాదా విషయమై కొన్నేళ్ల కిందట తనను చితక్కొట్టిన పోలీసులపై గుజరాత్‌కి చెందిన ఓ వ్యక్తి కక్ష పెంచుకున్నాడు. వారిపై తన కోపాన్ని ఎలాగైనా తీర్చుకోవాలనుకున్నాడు. అందుకు అతను ఓ వినూత్న పంథాన్ని ఎంచుకున్నాడు. వివరాల్లోకెళితే...దస్‌క్రోయిలోని కమోద్, భోయివాస్ ప్రాంతంలో నివసించే ఈశ్వర్ భోయి (40) పెళ్లి చేసుకున్న కొంత కాలానికే భార్యతో విడిపోయాడు. అతనికి మానసిక సమస్యలు కూడా ఉన్నాయి.
మూడేళ్ల కిందట సెక్యూరిటీ గార్డుగా పనిచేస్తున్న సమయంలో భోయి 108 అత్యవసర సర్వీసుకు ఫోన్ చేసి, అక్కడి డిస్‌పేచర్ ఉద్యోగిని దుర్భాషలాడాడు. ఈ నేరానికి నరోదా పోలీసులు అతన్ని అరెస్టు చేసి, తర్వాత బెయిల్‌పై విడుదల చేశారు. విడుదలయిన తర్వాత కూడా అతను పదే పదే కాల్స్ చేసి దుర్భాషలాడేవాడు. అతను ఎక్కువగా పోలీసు కంట్రోల్ రూమ్‌కే కాల్ చేసేవాడు.
మహిళా పోలీసులు ఫోన్ ఎత్తినప్పుడు వారితో అతను మరీ దారుణంగా మాట్లాడేవాడని అధికారులు తెలిపారు. అతను మొత్తం 1,264 సార్లు కాల్ చేశాడని వారు చెప్పారు. దీంతో అహ్మదాబాద్ నగర నేర విభాగం పరిధిలోని స్పెషల్ ఆపరేషన్స్ గ్రూప్ (ఎస్ఓజీ) రంగంలోకి దిగింది. ఎట్టకేలకు అతను వాడిన ఫోన్ల ఐఎంఈఐ నంబర్ల ఆధారంగా అతన్ని పట్టుకున్నామని ఏసీపీ (ఎస్ఓజీ) బీసీ సోలంకి తెలిపారు.