Andhra Pradesh: టీడీపీ, వైసీపీ విక్రమార్క ప్రయత్నం... ఐదోసారి నోటీసులు!
- కేంద్రంపై విశ్వాసం కోల్పోయామంటున్న టీడీపీ, వైసీపీ
- చర్చ కోసం గత నాలుగు సెషన్లలో ప్రయత్నాలు విఫలం
- నేడైనా చర్చకు వచ్చేనా?
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వని కేంద్ర ప్రభుత్వంపై తాము విశ్వాసం కోల్పోయామని, ఈ అంశంపై వెంటనే చర్చ చేపట్టాలని డిమాండ్ చేస్తూ, తెలుగుదేశం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలు లోక్ సభలో ఐదోసారి నోటీసులు ఇచ్చాయి. గత నాలుగు సెషన్లుగా ఇరు పార్టీల ఎంపీలూ చర్చ కోసం విక్రమార్క ప్రయత్నం చేస్తుండగా, టీఆర్ఎస్, అన్నాడీఎంకే వంటి పార్టీలు తమ డిమాండ్ల సాధనకు వెల్ లో నినాదాలు చేస్తుండటంతో సభ వాయిదా పడుతూ వస్తున్న సంగతి తెలిసిందే.
సభలో గందరగోళం నడుస్తోందని, అవిశ్వాసానికి మద్దతిచ్చే వారి సంఖ్యను లెక్కించడం కష్టంగా ఉందని నిత్యమూ సుమిత్రా మహాజన్ చెబుతూ వాయిదాలు వేస్తుండగా, ఈ మొత్తం వ్యవహారం వెనుక బీజేపీ కుట్ర దాగుందని టీడీపీ విమర్శిస్తున్న సంగతి తెలిసిందే. అవిశ్వాసంపై చర్చ చేపట్టేదాకా తాము వెనక్కు తగ్గబోమని రెండు పార్టీల ఎంపీలూ స్పష్టం చేశారు. కాగా, నేడు రెండు వేర్వేరు అవిశ్వాస తీర్మానాలను లోక్ సభ కార్యదర్శికి ఈ ఉదయం అందించారు. ఇక నేడైనా అవిశ్వాసంపై చర్చ జరుగుతుందా? లేక యథావిధిగానే వాయిదా పడుతుందా? అన్నది మరో మూడు గంటల్లో తేలిపోతుంది.