New Currency: రూ. 2000, రూ. 500, రూ. 200... కొంచెం చిరిగినా జేబుకు చిల్లే!
- చిరిగిన నోట్లు తీసుకునేందుకు బ్యాంకుల నిరాకరణ
- ఆర్బీఐ నుంచి మార్గదర్శకాలు జారీ కాకపోవడమే కారణం
- 40 శాతం వరకూ కమీషన్ పై దళారుల దందా
2016 నవంబర్ లో పెద్ద నోట్లను రద్దు చేసిన తరువాత ఇండియాలో చలామణిలోకి వచ్చిన రూ. 2 వేలు, రూ. 500, రూ. 200 కొత్త నోట్లకు రిఫండ్ రూల్స్ ఎలా ఉండాలన్న విషయమై, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎటువంటి విధి విధానాలనూ జారీ చేయకపోవడంతో, కొంచెం చిరిగినా ప్రజల జేబుకు చిల్లు పడుతోంది.
తమ వద్ద కొద్దిగా చిరిగిన కొత్త నోట్లు ఉన్నాయని, వాటిని తీసుకోవాలని నిత్యమూ వందలాది మంది బాధితులు బ్యాంకుల చుట్టూ తిరుగుతున్న పరిస్థితి నెలకొంది. వాటిని తీసుకోవద్దని రిజర్వ్ బ్యాంక్ నుంచి తమకు సూచనలు ఉన్నట్టు బ్యాంకు అధికారులు స్పష్టం చేస్తుండగా, మరోవైపు 30 నుంచి 40 శాతం కమీషన్ తో దళారులు ఆ నోట్లను తీసుకుని లక్షాధికారులవుతున్నారు.
వాస్తవానికి కొత్త 2 వేలు, 500 రూపాయల నోట్లు విడుదలై 16 నెలలు దాటింది. చిరిగిన నోట్లను బ్యాంకులు తీసుకోవడం లేదుగానీ, ఏటీఎంల నుంచి డబ్బు విత్ డ్రా చేసుకుంటే కొన్నిసార్లు చిరిగిన నోట్లే వస్తున్నాయన్న విమర్శలూ ఉన్నాయి. చిరిగిన నోట్లతో తమకు సంబంధం లేదని, వాటిని తీసుకుని రిజర్వ్ బ్యాంకు ప్రాంతీయ కార్యాలయాలకు వెళ్లి మార్చుకోవాలని బ్యాంకులు చెబుతున్నాయి.
రిజర్వ్ బ్యాంకు మార్గదర్శకాల కోసం తాము వేచిచూస్తున్నామని, అంతవరకూ వాటిని జాగ్రత్తగా దాచి పెట్టాలని బ్యాంకు అధికారులు చెబుతుండటంతో ఏం చేయాలో తెలియక ప్రజలు ఆందోళన చెందుతున్నారు. ఇదే సమయంలో దళారులు రూ. 2 వేల చిరిగిన నోటుకు రూ. 500, రూ. 500 చిరిగితే రూ. 200 వరకూ కమీషన్ తీసుకుని మారుస్తుండటం గమనార్హం.