MBBS internship: గ్రామ సర్పంచ్‌గా ఎంబీబీఎస్ స్టూడెంట్...!
- గ్రామ సర్పంచ్‌గా ఎన్నికై రికార్డు నెలకొల్పిన ఎంబీబీఎస్ విద్యార్థిని
- రాజకీయ నేపథ్యమున్న కుటుంబం నుంచి వచ్చిన నాలుగో తరం వ్యక్తి కావడం మరో విశేషం
- ఇంటర్న్‌షిప్‌తో పాటు సర్పంచ్‌గా కూడా రాణిస్తానని వెల్లడి
రాజస్థాన్‌లోని భరత్‌పూర్ జిల్లా, కమాన్ గ్రామ పంచాయతీకి ఈ నెల 5న ఓ ఎంబీబీఎస్ విద్యార్థిని సర్పంచ్‌గా ఎన్నికై చరిత్ర సృష్టించింది. వివరాల్లోకెళితే, ఆమె పేరు షహనాజ్ ఖాన్. ఎంబీబీఎస్ చదువుతోంది. ఆమె ఎంఎల్ఏగా ఎన్నికైన తొలి మియో ముస్లిం మహిళ అయిన కాంగ్రెస్ నేత జైదా ఖాన్ కుమార్తె. షహనాజ్ మెడిసిన్ చదువుతూనే సర్పంచ్‌గా గెలవడమే కాక రాజకీయ నేపథ్యం ఉన్న కుటుంబం నుంచి వచ్చిన నాలుగో తరం వ్యక్తి కావడం గమనార్హం. రాజస్థాన్, హర్యానా, పంజాబ్ రాష్ట్రాల నుంచి ఎంఎల్ఏగా ఎన్నికైన భారతదేశంలోని ఏకైక రాజకీయ వేత్త తయ్యబ్ హుస్సేన్‌కి ఆమె మనుమరాలు.
కమాన్ గ్రామ సర్పంచ్ పదవిని షహనాజ్ తాత హనీఫ్ ఖాన్ గత నాలుగు దశాబ్దాలుగా అలంకరించడం విశేషం. కాగా, మొరాదాబాద్‌లోని వైద్య కళాశాలలో షహనాజ్ చదువుతోంది. చదువుతో పాటు సర్పంచ్ పదవికి ఎలా న్యాయం చేస్తారన్న మీడియా ప్రశ్నకు, గురుగ్రామ్‌లో తాను ఇంటర్న్‌షిప్ చేయాల్సి ఉందని, తన స్వగ్రామం నుంచి అక్కడకు వెళ్లడానికి గంటన్నర సమయం పడుతుందని ఆమె చెప్పారు. అందువల్ల ఇంటర్న్‌షిప్ కోసం మధ్యాహ్నం వరకు, ఆ తర్వాత సమయాన్ని గ్రామ సేవ కోసం వినియోగిస్తానని షహనాజ్ వివరించింది. విద్యార్థిగా ఉంటూనే గ్రామ సేవకు ఆసక్తి చూపడం పట్ల స్థానికులు ఆమెను ఎంతగానో మెచ్చుకుంటున్నారు.