mansur ahmed: పాక్ హాకీ చాంపియన్ ను ఆదుకునేందుకు ముందుకు వచ్చిన అఫ్రిదీ
- 1992 బార్సిలోనా ఒలింపిక్స్ లో కాంస్యపతకం నెగ్గిన మన్సూర్ అహ్మద్
- 1994 ప్రపంచ కప్ ఫైనల్లో నెదర్లాండ్స్ కొట్టిన చివరి పెనాల్టీని అద్భుతంగా ఆపిన వైనం
- హాకీ హీరోగా పాక్ ప్రజల గుండెల్లో మన్సూర్
1992 బార్సిలోనా ఒలింపిక్స్ లో కాంస్యపతకం నెగ్గిన పాక్ జట్టు సభ్యుడు, 1994 ప్రపంచ కప్ ఫైనల్లో నెదర్లాండ్స్ కొట్టిన చివరి పెనాల్టీని అద్భుతంగా ఆపి జట్టును చాంపియన్ గా నిలిపి, జాతీయ హీరోగా మారిన మన్సూర్ అహ్మద్ తీవ్ర అనారోగ్యం బారినపడ్డాడు. హాకీలో హీరోగా పేరుప్రఖ్యాతులు సంపాదించినప్పటికీ మన్సూర్ ఒక మోస్తరు సంపాదనతో జీవితం వెళ్లబుచ్చాడు.
గత కొన్నేళ్లుగా హృదయ సంబంధిత సమస్యతో బాధపడుతూ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఆయన చికిత్సకు 15 లక్షల రూపాయలు ఖర్చవుతాయని ఆసుపత్రి వర్గాలు చెబుతున్నాయి. దీంతో సంపాదన మొత్తం ఖర్చుచేయగా, పాక్ హాకీ సమాఖ్య కొంత సాయమందించింది. చికిత్సకు డబ్బు నిండుకోవడంతో ఆయన తీవ్ర ఇబ్బంది పడుతున్నాడు.
దీంతో ఆయనను ఆదుకునేందుకు పాక్ దిగ్గజ క్రికెటర్ షాహిద్ అఫ్రిదీ ముందుకొచ్చాడు. తన ఫౌండేషన్ ద్వారా ఆయన వైద్యానికి అవసరమైన నిధులు సమకూరుస్తానని తెలిపాడు. మన్సూర్ లాంటి దిగ్గజాన్ని అలా చూస్తూ ఊరుకోలేమని పేర్కొన్నాడు. ఆయన పూర్తి ఆరోగ్యంగా ఉండేంతవరకు అఫ్రిదీ ఫౌండేషన్ ఆయనకు సంబంధించిన అన్ని ఖర్చులు భరిస్తుందని ప్రకటించాడు. దీనికి అన్ని వర్గాల నుంచి ప్రశంసలు కురుస్తున్నాయి.