vivo x21: స్క్రీన్ కిందే ఫింగర్ ప్రింట్ సెన్సార్... వివో ఎక్స్21 చైనాలో విడుదల
- చైనాలో ధర 2,898 యువాన్లు... రూపాయల్లో రూ.29,900
- 64 జీబీ, 128జీబీ వెర్షన్లలో ఆవిష్కరణ
- త్వరలో భారత మార్కెట్ కు
చైనాకు చెందిన ప్రముఖ స్మార్ట్ ఫోన్ కంపెనీ మరో నూతన మోడల్ ఎక్స్21 ను స్వదేశీ మార్కెట్లో విడుదల చేసింది. అంటే త్వరలో ఇది భారత్ కూ రానుంది. చైనా కంపెనీలు ముందుగా తమ దేశంలో లాంచ్ చేసిన తర్వాత భారత్ లో విడుదల చేస్తున్న విషయం తెలిసిందే. ఎక్స్21 మోడల్ ప్రత్యేకత ఏమిటంటే స్క్రీన్ కిందే ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఉండడం. ప్రత్యేకంగా ఫోన్ వెనుక భాగంలో లేదా ఫోన్ ముందు భాగంలో హోమ్ బటన్ ప్లేస్ లో సెన్సార్ ఉండటం తెలుసు. ఎక్స్ 21లో స్క్రీన్ పై ఫింగర్ ఉంచితే అన్ లాక్ అయిపోతుంది. ఈ విధమైన ఫీచర్ తో వచ్చిన రెండో ఫోన్ ఇది. వివో ఎక్స్20ప్లస్ మోడల్ లోనూ స్క్రీన్ కింద సెన్సార్ తో ఈ ఏడాది ఆరంభంలో విడుదల చేసిన విషయం తెలిసే ఉంటుంది.
ఎక్స్ 21 64జీబీ వెర్షన్ ధరను చైనాలో 2,898 యువాన్లుగా నిర్ణయించారు. మన కరెన్సీలో సుమారు రూ.29,900. 128జీబీ వెర్షన్ ధరను 3,198 యువాన్లుగా ఖరారు చేశారు. మన కరెన్సీలో సుమారు రూ.33,000. రూబీ రెడ్, అరోరా వైట్, బ్లాక్ కలర్స్ లో లాంచ్ చేసింది. డ్యుయల్ సిమ్ వివో ఎక్స్ 21 లో ఫన్ టచ్ ఓఎస్ 4.0, ఆండ్రాయిడ్ ఓరియో 8.1, 6.28 అంగుళాల ఫుల్ హెచ్ డీ సూపర్ అమోలెడ్ డిస్ ప్లే, 19:9 యాస్పెక్ట్ రేషియో, క్వాల్ కామ్ 660 ప్రాసెసర్, 6జీబీ ర్యామ్ ఉన్నాయి.