Rohit Sharma: కార్తీక్ విన్నింగ్ సిక్సర్‌ను రోహిత్ చూడకపోవడానికి కారణమిదేనట..!
- సూపర్ ఓవర్ ద్వారానే మ్యాచ్ ఫలితం తేలవచ్చని డ్రెస్సింగ్ రూమ్‌లోకి వెళ్లి ప్యాడ్ కట్టుకుంటున్నా
- అదే సమయంలో ఆఖరి బంతికి దినేశ్ సిక్సర్ కొట్టి జట్టును గెలిపించాడు
- దినేశ్ విన్నింగ్ సిక్సర్‌ని ప్రత్యక్షంగా చూడలేకపోవడానికి టీమిండియా సారధి వివరణ
భారత్-బంగ్లాదేశ్ జట్ల మధ్య శ్రీలంకలోని ప్రేమదాస స్టేడియంలో నిన్న జరిగిన ఉత్కంఠభరిత ఫైనల్ మ్యాచ్‌లో ఆఖరి బంతికి టీమిండియా వికెట్ కీపర్/బ్యాట్స్‌మన్ దినేశ్ కార్తీక్ కొట్టిన విన్నింగ్ సిక్సర్‌ని తానెందుకు ప్రత్యక్షంగా చూడలేకపోయాడో టీమిండియా సారధి రోహిత్ శర్మ వివరించాడు.
"మా జట్టు గెలవడానికి చివరి ఓవర్లో ఆఖరి రెండు బంతులకు ఐదు పరుగులు చేయాలి. ఐదో బంతికి శంకర్ ఔటయ్యాడు. అప్పటికి మా జట్టు స్కోరు 162 పరుగులు. ఇక మిగిలింది ఒక్క బంతే. స్ట్రైకింగ్‌లో కార్తీక్ ఉన్నాడు. అతను ఎలాగైనా ఫోర్ కొడతాడు. మ్యాచ్ డ్రాగా ముగుస్తుంది. అలాంటప్పుడు సూపర్ ఓవర్ ద్వారానే ఫలితాన్ని నిర్ణయిస్తారు. ఇదంతా అంచనా వేసుకుని నేను డ్రెస్సింగ్ రూమ్‌లోకి వెళ్లి ప్యాడ్ కట్టుకుంటున్నాను. ఆ సమయంలోనే కార్తీక్ సిక్స్ కొట్టి జట్టుకు మరపురాని విజయాన్ని అందించాడు" అని మ్యాచ్ అనంతరం రోహిత్ మీడియాతో అన్నాడు. ఈ మ్యాచ్‌లో భారత్ 4 వికెట్ల తేడాతో బంగ్లాపై గెలిచి నిదాహాస్ టీ-20 కప్‌ను కైవసం చేసుకుంది.