Rohit Sharma: దినేష్ కార్తీక్ కన్నా ముందు విజయ్ శంకర్ ను ఎందుకు పంపానంటే..: రోహిత్ శర్మ
- నిదహాస్ ట్రోఫీ ఫైనల్ లో 7వ స్థానంలో దినేష్ బ్యాటింగ్
- అతనికి అలవాటైన స్థానం అదే
- అందుకే విజయ్ ని ముందు పంపానన్న రోహిత్
నిన్న బంగ్లాదేశ్ తో నిదహాస్ ట్రోఫీ ఫైనల్ ఆడుతున్న వేళ, దినేష్ కార్తీక్ కన్నా ముందు విజయ్ శంకర్ ను బ్యాటింగ్ కు పంపాలని తీసుకున్న నిర్ణయం వెనకున్న కారణాన్ని మ్యాచ్ అనంతరం రోహిత్ శర్మ వెల్లడించాడు. ఈ మ్యాచ్ లో విజయ్ శంకర్ ఎక్కువగా బాల్స్ తినడంతో చివర్లో తీవ్ర ఒత్తిడి పెరిగిన సంగతి తెలిసిందే. ఈ మ్యాచ్ లో భారత్ ఓడిపోయుంటే, విజయ్ శంకర్ పైనా, విజయ్ ని ముందు పంపిన రోహిత్ పైనా విమర్శలు వెల్లువెత్తి ఉండేవి. బాల్ కు రెండు పరుగులు చేయాల్సిన స్థితిలో వచ్చిన శంకర్, 19 బంతులాడి 17 పరుగులు మాత్రమే చేశాడు. ఆపై దినేష్ కార్తీక్ వచ్చి 8 బంతుల్లో 29 పరుగుల అద్భుత ఇన్నింగ్స్ ఇచ్చి, టీమిండియాను విజయ తీరాలకు చేర్చాడు.
ఇక విజయ్ శంకర్ ను ముందు పంపడంపై స్పందించిన రోహిత్ శర్మ, గతంలో ఎన్నో మ్యాచ్ ల్లో 7వ స్థానంలో రోహిత్ బ్యాటింగ్ చేశాడని, ముంబై ఇండియన్స్ టీమ్ లోనూ కార్తీక్ 7వ స్థానంలో ఆడేవాడని గుర్తు చేసిన రోహిత్, అతనికి అలవాటైన స్థానంలో పంపాలని అనుకున్నందునే శంకర్ ను ముందు పంపినట్టు చెప్పాడు. దినేష్ కార్తీక్ సత్తా తనకు తెలుసునని, చివరి రెండు ఓవర్లలో అధిక పరుగులు సాధించగలడన్న నమ్మకం కూడా తనకుందని వెల్లడించాడు. డెత్ ఓవర్లలో వేగంగా పరుగులు సాధించే సత్తా దినేష్ కుందని తాను గర్వంగా చెప్పగలనని అన్నాడు.