Hasin jahan: మీకు చేతులెత్తి మొక్కుతున్నా.. నా బాధ వినండి: మమతా బెనర్జీకి షమీ భార్య అభ్యర్థన
- తన బాధ వినాలంటూ సీఎంకు మొర
- మద్దతు అవసరం లేదన్న షమీ భార్య
- తన పోరాటంలో న్యాయం ఉందని వ్యాఖ్య
టీమిండియా పేసర్ మహమ్మద్ షమీపై తీవ్ర ఆరోపణలు చేసిన హసీన్ జహాన్ తాజాగా పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీని తన మొర ఆలకించాల్సిందిగా వేడుకున్నారు. తాను చెప్పే బాధను వినాలని, అందుకోసం తనకు కొంత సమయం ఇవ్వాలని అభ్యర్థించారు. హసీన్ ఆరోపణలపై కేసు నమోదు చేసిన కోల్కతా పోలీసులు ఇప్పటికే దర్యాప్తు ప్రారంభించగా, తాజాగా బీసీసీఐ అవినీతి నిరోధక విభాగం కూడా దర్యాప్తు చేపట్టింది.
ఆదివారం హసీన్ జహాన్ విలేకరులతో మాట్లాడుతూ.. తాను చాలా చిత్రహింసలు అనుభవించానని, తన బాధను పంచుకునేందుకు తనకు సమయం ఇవ్వాలని సీఎంను కోరారు. ‘‘సీఎం మమతా బెనర్జీ గారికి ఈరోజు నేను రెండు చేతులు జోడించి వేడుకుంటున్నా. మేడమ్, నా పోరాటంలో న్యాయం ఉంది. నా తప్పు లేకుండానే చిత్రహింసలు అనుభవించా. నేను మీ మద్దతు అడగడం లేదు. న్యాయం కోసం నేను చేస్తున్న పోరాటంపై దృష్టి సారించాలని మాత్రమే కోరుతున్నా. మిమ్మల్ని కలవడానికి సమయం ఇవ్వండి. నేను చెప్పేది వినండి. ఆ తర్వాత ఎటువంటి నిర్ణయం తీసుకున్నా మీ ఇష్టం. నేను చేస్తున్న అభ్యర్థన ఇదొక్కటే’’ అని హీసన్ పేర్కొన్నారు.